IPL 2024: సూర్య‌కుమార్ వ‌చ్చేశాడు.. వీడియో విడుద‌ల చేసిన ముంబై ఫ్రాంచైజీ!

Big boost for Mumbai Indians as star player Surya Kumar Yadav joins team ahead of Delhi Capitals clash
షార్ట్స్‌లో చూడండి
వ‌రుస ఓట‌ముల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ముంబై ఇండియ‌న్స్‌కు భారీ ఊర‌ట ల‌భించింది. ఆ జ‌ట్టు స్టార్ ఆట‌గాడు, వ‌ర‌ల్డ్ నం.01 టీ20 ప్లేయ‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్ తిరిగి జ‌ట్టుతో చేరాడు. నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీ (ఎన్‌సీఏ) నుంచి క్లియరెన్స్ స‌ర్టిఫికేట్ రావ‌డంతో శుక్ర‌వారం ఎంఐ జ‌ట్టు బ‌స చేసిన హోటల్‌కు సూర్య రావ‌డాన్ని ముంబై ఫ్రాంచైజీ త‌న‌ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా వీడియో విడుద‌ల చేసింది. ఇందులో సూర్య త‌న కారు నుంచి దిగి హోటల్‌కు వెళ్ల‌డం మ‌నం చూడొచ్చు. కాగా, సూర్య‌కుమార్ గ‌తేడాది డిసెంబ‌ర్‌లో ద‌క్షిణాఫ్రికాపై చివ‌రి సారిగా క్రికెట్ ఆడాడు. ఆ త‌ర్వాత చీల‌మండ గాయంతో ఆట‌కు దూర‌మ‌య్యాడు. అప్ప‌టి నుంచి ఎన్‌సీఏలోనే ఉండి గాయం నుంచి కోలుకున్నాడు. 

దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో గాయ‌ప‌డ్డ‌ సూర్యకుమార్ ఆ త‌ర్వాత‌ శస్త్రచికిత్స చేయించుకున్నాడు. దీంతో అతను ఆఫ్ఘనిస్థాన్‌తో స్వ‌దేశంలో జ‌రిగిన టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ నేప‌థ్యంలోనే సూర్య ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఎంఐ ఆడిన‌ మొదటి మూడు మ్యాచ్‌లు కూడా ఆడ‌లేక‌పోయాడు. ఇక‌ ముంబై ఇండియన్స్ జ‌ట్టులో కీలక ఆటగాడిగా ఉన్న 32 ఏళ్ల సూర్య‌ ఈ నెల 7న (ఆదివారం) ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) తో జరగబోయే మ్యాచ్‌లో బ‌రిలోకి దిగే అవ‌కాశం ఉంది. 

ఇక ఎంఐ త‌ర‌ఫున‌ 87 మ్యాచ్‌ల‌కు ప్రాతినిధ్యం వ‌హించిన అత‌డు ఇప్ప‌టివ‌ర‌కు 2,688 పరుగులు చేశాడు. ఇప్పుడు సూర్య‌ తిరిగి రావడంతో నిస్సందేహంగా ముంబై మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ కావ‌డంతో పాటు జట్టు మొత్తం బలోపేతం అవుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. కాగా, ముంబై ఐపీఎల్ 17వ సీజ‌న్‌ను చాలా పేల‌వంగా ప్రారంభించింది. వరుసగా మూడు మ్యాచ్‌లలో ఓడిపోవ‌డంతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. 

ఐదుసార్లు ఐపీఎల్‌ ఛాంపియన్ అయిన ఎంఐ ఈసారి మాత్రం ఘోరంగా ఆడుతోంది. గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పాటు ఇటీవల హోమ్ గ్రౌండ్ వాంఖడే స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌పై ఓటమిని చవిచూసింది. బ‌ల‌మైన బ్యాటింగ్ లైన‌ప్ క‌లిగిన ముంబై.. గుజరాత్ టైటాన్స్‌పై 169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైంది. అలాగే వాంఖడే స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌పై కేవ‌లం 125 మాత్రమే స్కోర్ చేసింది. దీంతో ఎంఐ ప్ర‌ద‌ర్శ‌న ప‌ట్ల‌ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రోవైపు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై కూడా తీవ్ర‌ విమ‌ర్శ‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.
Go Back to Shorts
IPL 2024
Surya Kumar Yadav
Mumbai Indians
Cricket
Sports News

More Telugu News