Advertisement

ఒకే విమానంలో మాజీ సీఎం చంద్రబాబు, మంత్రి రోజా

Former CM Chandrababu and Minister Roja traveled in the same flight from Tirupati to Vijayawada
  • తిరుపతి నుంచి విజయవాడకు ఇండిగో విమానంలో ప్రయాణించిన టీడీపీ అధినేత, మంత్రి 
  • అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక లాంజ్‌ ద్వారా రోజాను బయటకు పంపిన పోలీసులు
  • వీరిద్దరి రాకకు 10 నిమిషాల ముందు అదే ఎయిర్‌పోర్టులో దిగిన జనసేన అధినేత పవన్ కల్యాణ్
మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, వైఎస్సార్‌సీపీ కీలక నేత, రాష్ట్రమంత్రి రోజా అనూహ్యంగా ఒకే విమానంలో ప్రయాణించారు. తిరుపతి నుంచి విజయవాడకు ఒకే ఇండిగో విమానంలో వచ్చారు. శుక్రవారం ఈ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పరస్పరం ఆరోపణలు, విమర్శలు గుప్పించుకునే నేతలు ఈ విధంగా ఒకే విమానంలో ప్రయాణించడం ఆసక్తిని రేకెత్తించింది. అయితే చంద్రబాబు రాక కోసం టీడీపీ శ్రేణులు అప్పటికే పెద్ద సంఖ్యలో విమానాశ్రయంలో వేచివుండడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా ప్రత్యేక లాంజ్ ద్వారా మంత్రి రోజాను పోలీసు అధికారులు బయటకు పంపించారు. గతంలో విశాఖపట్నం విమానాశ్రయంలో జనసేన కార్యకర్తలు వేచివున్న సమయంలో రోజా రాకతో తలెత్తిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ విధంగా వ్యవహరించారు.

మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. చంద్రబాబు, రోజా ప్రయాణించిన విమానం విజయవాడకు చేరుకోవడానికి 10 నిమిషాల ముందే జనసేన అధినేత పవన్ కల్యాణ్ అదే విమానాశ్రయంలో అడుగుపెట్టారు. హైదరాబాద్ నుంచి విజయవాడ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన మంగళగిరి వెళ్లి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భార్య నారా భువనేశ్వరితో కలిసి శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుపతి నుంచి విజయవాడకు చేరుకున్న విషయం తెలిసిందే.
Advertisement
Chandrababu
Roja
Telugudesam
YSRCP
Andhra Pradesh
Vijayawada airport

More Telugu News