హైదరాబాద్‌ చేరుకున్న చంద్రబాబు.. అభిమానుల ఘనస్వాగతం

హైదరాబాద్‌ చేరుకున్న చంద్రబాబు.. అభిమానుల ఘనస్వాగతం

Chandrababu receives grand welcome in Begumpet airport
  • గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్న టీడీపీ అధినేత
  • విమానాశ్రయానికి భారీగా తరలివచ్చిన అభిమానులు
  • చంద్రబాబు అనుకూల నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిన వైనం
  • మీడియాతో మాట్లాడకుండా తన నివాసానికి బయలుదేరిన టీడీపీ అధినేత
  • రేపు ఏఐజీ ఆసుపత్రిలో బాబుకు వైద్య పరీక్షలు
మధ్యంతర బెయిల్‌పై విడుదలైన టీడీపీ అధినేత చంద్రబాబుకు నేడు హైదరాబాద్‌లో ఘన స్వాగతం లభించింది. జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న చంద్రబాబు నిన్న రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదలయ్యారు. ఈ రోజు ఉదయం ఆయన టీడీపీ కార్యకర్తలు, అభిమానుల జయజయధ్వానాల నడుమ ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. సాయంత్రం, చంద్రబాబు గన్నవరం విమానాశ్రయం నుంచి తన కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరారు.  బేగంపేటలో దిగిన ఆయనకు భారీగా తరలివచ్చిన టీడీపీ శ్రేణులు, అభిమానులు, ఐటీ ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తించారు. 

షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలైన నేపథ్యంలో చంద్రబాబు కారులోంచే తనను చూసేందుకు వచ్చిన వారికి అభివాదం చేశారు. మీడియాతో మాట్లాడకుండానే ఆయన వెళ్లిపోయారు. టీడీపీ శ్రేణులు, అభిమానులు వేలాది మంది ఆయన కారును అనుసరించారు. ఈ సందర్భంగా అనేక మంది బేగంపేట, జూబ్లీహిల్స్ రహదారులకు ఇరువైపులా నిలబడి చంద్రబాబుకు ఆహ్వానం పలికేందుకు సిద్ధమయ్యారు. గురువారం ఉదయం నగరంలోని ఏఐజీ ఆసుపత్రిలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.
Advertisement
Chandrababu
Telugudesam
Hyderabad

More Telugu News