నిజంగానే ఆధారాలు ఉంటే 50 రోజులుగా ఏం చేస్తున్నారంటూ ప్రభుత్వంపై లోకేశ్ ఫైర్
- చంద్రబాబుపై కేసులకు సంబంధించిన ఆధారాలు ప్రజల ముందు పెట్టాలని డిమాండ్
- ఇదే శ్రద్దను రైతుల సమస్యలు తీర్చడంలో చూపించాలని ప్రభుత్వానికి హితవు
- చంద్రబాబును జైలులోనే చంపేస్తామంటున్నారని విమర్శ
వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును జైలులో పెట్టారని లోకేశ్ విమర్శించారు. ప్రజల నుంచి ఆయనను దూరం చేయడానికి, ప్రజా సమస్యలపై పోరాడకుండా అడ్డుకోవడానికి వైసీపీ ప్రభుత్వం ఈ నాటకం ఆడుతోందని ఆరోపించారు. అంతే తప్ప చంద్రబాబు ఏ తప్పూ చేయలేదని లోకేశ్ తెలిపారు. టీడీపీ అధినేతను జైలులోకి పంపడంపై పెట్టిన శ్రద్ధను రాష్ట్రంలోని రైతుల సమస్యలను పరిష్కరించడంలో పెడితే బాగుండేదని అన్నారు. సౌత్ ఇండియాలోనే ఎన్ ఎస్ జీ ప్రొటెక్షన్ కలిగిన ఒకేఒక నేత చంద్రబాబు అని, ఆయనకు మావోయిస్టుల నుంచి ప్రాణహాని ఉండడంతో కేంద్రం ఈ రక్షణ కల్పించిందని చెప్పారు. అలాంటి వ్యక్తిని అన్యాయంగా జైలులో పెట్టి, సరైన రక్షణ కల్పించకపోవడం చూస్తుంటే తమకు అనుమానంగా ఉందన్నారు. తమ అధినేతను జైలులోనే అంతమొందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందేమోనని లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు.