నోట్లోకి గాలి ఊది పామును కాపాడిన కానిస్టేబుల్.. వీడియో ఇదిగో!
- పైపులో దూరిన పామును వెళ్లగొట్టేందుకు పురుగు మందు నీళ్లు పోసిన స్థానికులు
- ఆ నీళ్లు తాగి కదలిక లేకుండా పడి ఉన్న పాము
- కానిస్టేబుల్ సీపీఆర్ చేయడంతో పాములో కదలిక
- మధ్యప్రదేశ్ లో ఘటన.. వీడియో వైరల్
నర్మదాపురం పట్టణంలోని ఓ కాలనీలోకి పాము చొరబడింది. ఓ ఇంట్లోని పైప్ లైన్ లో చేరింది. దీనిని బయటకు వెళ్లగొట్టేందుకు ఆ ఇంటివాళ్లు విషం కలిపిన నీళ్లను పైపులోకి జారవిడిచారు. ఆ నీళ్లు తాగిన పాము కాసేపటికి బయటపడింది. అయితే, పాములో చలనం లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. డిపార్ట్ మెంట్ లో పాములను కాపాడే కానిస్టేబుల్ అతుల్ శర్మ అక్కడికి చేరుకుని పామును పరిశీలించారు.
ఆ పాము విషపూరితం కాదని, కొన ఊపిరితో ఉందని గుర్తించి సీపీఆర్ చేశారు. పాము నోట్లో నోరు పెట్టి గాలి ఊదారు. కాసేపు ప్రయత్నించిన తర్వాత ఆ పాము కళ్లు తెరిచింది. మరికాసేపటికి పూర్తిగా స్పృహలోకి వచ్చిన ఆ పామును అడవిలో వదిలేసినట్లు అతుల్ శర్మ తెలిపారు. డిస్కవరీ ఛానెల్ చూస్తూ ఈ సీపీఆర్ పద్ధతి గురించి తెలుసుకున్నానని, గత పదిహేనేళ్లలో దాదాపు 500 లకు పైగా పాములను ఇలాగే కాపాడానని వివరించారు.