మీ ఖాతాలోని డబ్బు మీది కాదా? ఆధారాలు లేకపోతే పన్ను తప్పదు!

మీ ఖాతాలోని డబ్బు మీది కాదా? ఆధారాలు లేకపోతే పన్ను తప్పదు!

Is the money in your account not yours Proof is mandatory to avoid tax
  • ఇతరుల కోసం వసూలు చేసిన డబ్బును వ్యక్తిగత ఖాతాలో వేయొచ్చు
  • కానీ, అది మీది కాదని నిరూపించే పత్రాలు తప్పనిసరిగా ఉండాలి
  • రూ.20 లక్షల నగదు డిపాజిట్ల కేసులో ఐటీఏటీ బెంగళూరు బెంచ్ స్పష్టత
  • ఆధారాలు లేకపోతే లెక్కల్లో చూపని ఆదాయంగా పన్ను విధిస్తారు
  • సంఘాలు, సంస్థల కోసం డబ్బు వసూలు చేసేవారికి ఇది ఒక హెచ్చరిక
ఇతరుల డబ్బును మీ వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో జమ చేస్తే, దానికి పన్ను కట్టాల్సిన అవసరం లేదని, అయితే ఆ డబ్బు మీది కాదని నిరూపించేందుకు పక్కా ఆధారాలు, రికార్డులు తప్పనిసరిగా ఉండాలని ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రైబ్యునల్ (ITAT) బెంగళూరు బెంచ్ స్పష్టం చేసింది. 89 ఏళ్ల రిటైర్డ్ స్కూల్ ప్రిన్సిపాల్‌కు సంబంధించిన కేసులో 2026 సెప్టెంబర్ 22న ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు ఇతరుల తరఫున నగదు లావాదేవీలు జరిపేవారికి ఒక ముఖ్యమైన హెచ్చరికగా నిలుస్తోంది.

కేసు వివరాలు
కర్ణాటకలోని తుముకూరుకు చెందిన సుళికెరె కల్లెగౌడ రాజశేఖర్ (89) అనే రిటైర్డ్ ప్రిన్సిపాల్, 2017-18 ఆర్థిక సంవత్సరానికి తన ఆదాయం రూ.5.72 లక్షలుగా చూపుతూ రిటర్న్స్ దాఖలు చేశారు. అయితే, ఆయనకు చెందిన రెండు బ్యాంకు ఖాతాల్లో రూ.20.33 లక్షల నగదు జమ అయినట్లు ఆదాయపు పన్ను శాఖ గుర్తించింది. దీనిపై వివరణ కోరగా, తాను లాభాపేక్ష లేకుండా శ్రీ విద్యా పీఠ ఎడ్యుకేషన్ సొసైటీకి చెందిన మహిళా హాస్టల్‌ను నిర్వహిస్తున్నానని, ఆ డబ్బు విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజు అని తెలిపారు. పరిపాలనా సౌలభ్యం కోసం తన వ్యక్తిగత ఖాతాల్లో జమ చేసి, హాస్టల్ ఖర్చులకు వాడానని, కేవలం రూ.2,251 మాత్రమే మిగిలిందని, దానికి పన్ను చెల్లించడానికి సిద్ధమని చెప్పారు.

అయితే, ఆయన వాదనను అసెసింగ్ అధికారి (ఏఓ) తిరస్కరించారు. హాస్టల్ ఫీజు వసూళ్లకు సంబంధించిన అసలు రశీదులు, పూర్తి ఆదాయ-వ్యయాల వివరాలు సమర్పించలేదని పేర్కొంటూ, ఆ మొత్తం రూ.20.33 లక్షలను లెక్కల్లో చూపని ఆదాయంగా (సెక్షన్ 69ఏ కింద) పరిగణించి పన్ను విధించారు. ఈ నిర్ణయాన్ని సీఐటీ(ఏ) కూడా సమర్థించింది.

ఐటీఏటీ తీర్పు ఇలా..
ఈ కేసును విచారించిన ఐటీఏటీ, రాజశేఖర్ వాదనను పూర్తిగా అంగీకరించలేదు, అలా అని తిరస్కరించనూ లేదు. కేసును తిరిగి పరిశీలన కోసం అసెస్ మెంట్ అధికారికి పంపింది. ఈ సందర్భంగా కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజశేఖర్ నిజంగానే ఆ విద్యాసంస్థ తరఫున హాస్టల్ నడుపుతున్నారా లేదా అన్నది ధ్రువీకరించుకోవాలని సూచించింది. అలాగే, హాస్టల్ ఫీజు రశీదులను సొసైటీ పేరు మీద జారీ చేశారా, ఆ మొత్తాన్ని సొసైటీ ఖాతా పుస్తకాల్లో నమోదు చేశారా లేదా అన్నది తనిఖీ చేయాలని ఆదేశించింది.

ఒకవేళ ఆ డబ్బు సొసైటీకి చెందినదని, వారి రికార్డుల్లో సరిగ్గా నమోదై ఉందని తేలితే, రాజశేఖర్‌పై విధించిన అదనపు పన్నును తొలగించాలని స్పష్టం చేసింది. అలా కాని పక్షంలో, వసూలైన డబ్బులో ఖర్చులు పోగా కేవలం రూ.2,251 మాత్రమే ఎలా మిగిలిందో రాజశేఖర్ నిరూపించుకోవాల్సి ఉంటుందని తెలిపింది. వృద్ధాప్యం, అనారోగ్య కారణాల రీత్యా అప్పీల్ దాఖలులో జరిగిన 666 రోజుల జాప్యాన్ని కూడా ట్రైబ్యునల్ మన్నించింది.

ఈ తీర్పు ద్వారా, సంఘాలు, అసోసియేషన్లు, సంస్థల కోసం డబ్బు వసూలు చేసే వ్యక్తులు తప్పనిసరిగా స్పష్టమైన రికార్డులు నిర్వహించాలని పన్ను నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరైన పత్రాలు లేకపోతే, ఇతరుల డబ్బు అయినా సరే.. మీ వ్యక్తిగత ఆదాయంగా పరిగణించి పన్ను శాఖ చర్యలు తీసుకునే ప్రమాదం ఉంటుంది.
Advertisement
Sulikere Kallegowda Rajasekhar
Income Tax Appellate Tribunal
ITAT Bengaluru Ruling
Income Tax on Bank Deposits
Section 69A Income Tax Act
Tax on Third Party Money

More Telugu News