'తాయ్ మామన్' పథకానికి శ్రీకారం.. మేనమామలా మారిన సీఎం విజయ్

'తాయ్ మామన్' పథకానికి శ్రీకారం.. మేనమామలా మారిన సీఎం విజయ్

CM Vijay launches Thai Maman scheme and acts like a maternal uncle
  • 'తాయ్ మామన్' గోల్డ్ రింగ్ పథకాన్ని ప్రారంభించిన సీఎం విజయ్ 
  • ప్రభుత్వ ఆసుప‌త్రుల్లో పుట్టిన శిశువులకు ఒక గ్రాము బంగారు ఉంగరం
  • మధురై రాజాజీ ఆసుప‌త్రిలో చిన్నారులకు స్వయంగా ఉంగరాలు తొడిగిన సీఎం 
  • కొందరు చిన్నారులకు సంప్రదాయబద్ధంగా నామకరణం కూడా చేసిన విజ‌య్‌
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేడు మధురైలో 'తాయ్ మామన్' గోల్డ్ రింగ్ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుప‌త్రుల్లో జన్మించిన శిశువులకు ఒక గ్రాము బంగారు ఉంగరాన్ని అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. మధురైలోని ప్రభుత్వ రాజాజీ ఆసుప‌త్రిలో జరిగిన ఈ కార్యక్రమం ద్వారా సీఎం విజయ్ ఈ బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టారు.

బిస్కెట్ కలర్ చొక్కా, పంచె ధరించిన సీఎం విజయ్, వేదికపై ముగ్గురు శిశువులకు స్వయంగా బంగారు ఉంగరాలు తొడిగి పథకాన్ని ప్రారంభించారు. తల్లులను ఆప్యాయంగా కుర్చీల్లో కూర్చోబెట్టి, పక్కనే ఉండి చిన్నారుల వేళ్లకు జాగ్రత్తగా ఉంగరాలు తొడిగారు. అనంతరం ఆయన వేదిక దిగి కింద కూర్చున్న మరో 12 మంది తల్లులు, వారి శిశువుల వద్దకు వెళ్లారు. అక్కడ చిన్నారులను చేతుల్లోకి తీసుకుని, వారి తల్లిదండ్రులతో ఆప్యాయంగా మాట్లాడారు.

ఈ సందర్భంగా కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు పేరు పెట్టాలని సీఎం విజయ్‌ను కోరారు. వారి అభ్యర్థనను మన్నించిన ఆయన, చిన్నారులను ఎత్తుకుని సంప్రదాయబద్ధంగా మూడుసార్లు పేరును ఉచ్ఛరించి నామకరణం చేశారు. ఈ భావోద్వేగపూరిత క్షణాల్లో అక్కడున్న వారంతా హర్షం వ్యక్తం చేశారు. 

అనంతరం తల్లులతో సెల్ఫీలు దిగి, కరచాలనం చేసి వారిని ఉత్సాహపరిచారు. ఆ తర్వాత ఆసుపత్రిలోని ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ వార్డును సందర్శించి, అక్కడ మరో 10 మంది శిశువులకు బంగారు ఉంగరాలు అందించారు. వైద్యుల సమక్షంలో చిన్నారులతో, వారి తల్లిదండ్రులతో సరదాగా గడిపారు.

అంతకుముందు ఉదయం 11 గంటలకు చెన్నై నుంచి మధురై విమానాశ్రయానికి చేరుకున్న సీఎం విజయ్‌కు పార్టీ కార్యకర్తలు, అభిమానులు వందలాదిగా తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. ఆయన కాన్వాయ్ ఆసుపత్రికి వెళ్లే దారి పొడవునా ప్రధాన కూడళ్ల వద్ద ప్రజలు నిలబడి పూలవర్షం కురిపించారు. 

రాజాజీ ఆసుప‌త్రి వద్ద వాహనం దిగి, జనసందోహం మధ్య నడుచుకుంటూనే వేదిక వద్దకు చేరుకున్నారు. దారిలో ఆసుపత్రి సిబ్బంది, ప్రజలకు అభివాదం చేస్తూ, పలుచోట్ల ఆగి వారితో ఫొటోలు దిగారు. సీఎం రాకతో ఆసుప‌త్రి పరిసరాలు జనసంద్రంగా మారాయి.
Advertisement
Vijay
Thai Maman Scheme
Madurai Rajaji Hospital
Gold Ring Scheme
Tamil Nadu CM
Newborn Welfare

More Telugu News