వాలంటీర్ వ్యవస్థపై న్యాయస్థానంలో తేల్చుకుంటాం: పవన్ కల్యాణ్
- ఉంగుటూరు నియోజకవర్గ నేతలు, వీరమహిళలతో పవన్ భేటీ
- రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ అవసరంలేదని స్పష్టీకరణ
- వ్యక్తిగత సమాచారం సేకరించేందుకు వాలంటీర్లు ఎవరన్న పవన్
- జగన్ అనే జలగలు వస్తుంటాయి, పోతుంటాయి అని వ్యాఖ్యలు
రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ అనవసరం అని, ఉన్న వ్యవస్థలను బలోపేతం చేయకుండా, అవసరంలేని వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారని విమర్శించారు. వ్యక్తిగత సమాచారం సేకరించేందుకు వాలంటీర్లు ఎవరు? అని పవన్ ప్రశ్నించారు. వాలంటీర్లు సేకరించిన సమాచారాన్ని ఎక్కడ ఉంచుతున్నారు? అని నిలదీశారు.
వాలంటీర్ల రూపంలో ప్రతి 50 ఇళ్లకు ఒక జగన్ తయారయ్యాడని వ్యాఖ్యానించారు. జగన్ అనే జలగలు వస్తుంటాయి, పోతుంటాయి... జగన్ వంటి వాళ్లు వచ్చినంత కాలం నాలాంటి వాళ్లు వస్తుంటారు అని వివరించారు.
ముఖ్యమంత్రికి పిండాకూడుకు, పిండివంటకు తేడా తెలియదని ఎద్దేవా చేశారు. తద్దినానికి, అట్లతద్దెకు తేడా తెలియనివాడని, శ్రాద్ధానికి, శ్రావణ శుక్రవారానికి తేడా తెలియదని ఎద్దేవా చేశారు. 'అ'కి 'ఆ'కి తేడా తెలియనివాడు, వరాహికి వారాహికి తేడా తెలియనివాడు... ఆ మహానుభావుడు ముఖ్యమంత్రి అంటూ పవన్ వ్యంగ్యం ప్రదర్శించారు.