రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. మండలిలో హోరాహోరీ!

Andhra Pradesh Assembly Monsoon Sessions from tomorrow intense debate expected in Council
  • సోమవారం నుంచి ఏపీ శాసనసభ వర్షాకాల సమావేశాలు
  • ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదన్న కారణంతో అసెంబ్లీకి వైసీపీ దూరం
  • శాసనమండలిలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని జగన్ వెల్లడి
  • సభకు రావాలని వైసీపీ ఎమ్మెల్యేలకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు పిలుపు
  • మెగా డీఎస్సీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై మండలిలో చర్చకు వైసీపీ వ్యూహం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఉభయ సభలను సమావేశపర్చనున్నారు. అయితే, వైసీపీ.. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించడంతో ఈసారి కూడా సభ కూటమి సభ్యులతోనే జరగనుంది. ప్రతిపక్ష నేత (ఎల్‌ఓపీ) హోదా నిరాకరణకు నిరసనగా తమ బహిష్కరణ కొనసాగుతుందని వైసీపీ ఇప్పటికే స్పష్టం చేసింది.

మరోవైపు, ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఎల్ నినో ప్రభావం, రైతుల సమస్యలు, అమరావతి రాజధాని నగర నిర్మాణ పనుల పురోగతి వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ అంశాలపై అధికారపక్షం తన వాదనను వినిపించనుంది.

స్పీకర్ ఆహ్వానం.. వైసీపీ తిరస్కరణ
సమావేశాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదివారం తెలిపారు. వైసీపీ సభ్యులు సభకు హాజరై ప్రజా సమస్యలను ప్రస్తావిస్తే, సంబంధిత మంత్రుల నుంచి సమాధానాలు ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలపై చర్చించడం, తమ నియోజకవర్గాల వాణిని వినిపించడం శాసనసభ్యుల బాధ్యత అని, జగన్ తో సహా వైసీపీ ఎమ్మెల్యేలందరూ సభకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. గతంలో, అసెంబ్లీకి హాజరుకాని ఎమ్మెల్యేలకు జీతాలు ఎందుకు చెల్లించాలని స్పీకర్ ప్రశ్నించారు. ఈ అంశంపై పార్లమెంటులో చర్చించి, తగిన చట్టం తీసుకురావాలని కూడా ఆయన సూచించడం గమనార్హం.

మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం: జగన్
అసెంబ్లీని బహిష్కరిస్తున్నప్పటికీ, శాసనమండలిలో ప్రజా సమస్యలపై గళం విప్పాలని వైసీపీ నిర్ణయించింది. పార్టీ శాసనసభ్యులతో ఇటీవల సమావేశమైన ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్, ఈ మేరకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. ప్రతిపక్ష గొంతు నొక్కేందుకే చంద్రబాబు ప్రభుత్వం తమకు ఎల్‌ఓపీ హోదా ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు.

మండలిలో పార్టీకి ఉన్న సంఖ్యాబలాన్ని ఉపయోగించుకుని ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని జగన్ సూచించారు. మెగా డీఎస్సీ-2025పై చర్చించాలని ఆదేశించారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రమేయంపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేయాలని పార్టీ సభ్యులకు సూచించారు.

దాదాపు 13 త్రైమాసికాలుగా పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.9,100 కోట్లు, వసతి దీవెన బకాయిలు రూ.3,300 కోట్లను ప్రభుత్వం చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఈ అంశాలను కూడా మండలిలో బలంగా ప్రస్తావించాలని జగన్ స్పష్టం చేశారు. దీంతో, అసెంబ్లీలో చర్చ ప్రశాంతంగా సాగినా, శాసనమండలిలో మాత్రం అధికార, విపక్షాల మధ్య వాడివేడి వాతావరణం నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి.
Advertisement
Andhra Pradesh Assembly
YS Jagan Mohan Reddy
Monsoon Sessions 2024
YSRCP Boycott
Chandrababu Naidu
AP Legislative Council

More Telugu News