చంద్రగిరిలో ఏనుగుల బీభత్సం.. రంగంలోకి దిగిన పవన్ కల్యాణ్

Pawan Kalyan Intervenes in Chandragiri Elephant Menace Issue
  • చంద్రగిరి సమీపంలో ఏనుగుల సంచారంతో ప్రజలు ఆందోళన
  • అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం
  • డ్రోన్లతో నిఘా, రాత్రి పూట గస్తీ పెంచాలని కీలక సూచనలు
  • పంట నష్టపోయిన రైతులకు తక్షణ పరిహారం అందిస్తామని హామీ
  • పరిస్థితిని బట్టి హనుమాన్ బృందాలను మోహరించాలని ఆదేశం
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఎర్రవారిపాలెం మరియు సమీప గ్రామాల్లో ఏనుగుల గుంపు సంచారం స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. శేషాచలం అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఈ ఏనుగులు రాత్రివేళల్లో పంట పొలాలపై పడి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తున్నాయి. ఈ విషయంపై స్పందించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్, ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని అటవీశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై ఆయన అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి కీలక దిశానిర్దేశం చేశారు.

ఏనుగుల కదలికలను నిరంతరం పర్యవేక్షించాలని, ఇందుకోసం ఆధునిక టెక్నాలజీని వినియోగించుకోవాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. డ్రోన్ల సహాయంతో ఏనుగుల సంచార మార్గాలను గుర్తించి, ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు సమీప గ్రామాల ప్రజలకు చేరవేయాలని సూచించారు. ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు అటవీ, రెవెన్యూ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ముఖ్యంగా అటవీ సరిహద్దు గ్రామాల్లో రాత్రివేళల్లో ప్రత్యేక గస్తీ బృందాలను ఏర్పాటు చేసి, ప్రజలు పొలాల వద్దకు వెళ్లకుండా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. స్థానిక సమాచార వ్యవస్థలు, మైకులు, మొబైల్ సందేశాల ద్వారా ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయాలని తెలిపారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ స్పందిస్తూ, "ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడం మన ప్రథమ కర్తవ్యం. ఏనుగుల వల్ల ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. క్షేత్రస్థాయి సిబ్బంది 24 గంటలూ అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని సమీక్షించాలి. అవసరమైతే, ప్రజల భద్రత కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన 'హనుమాన్' (H.A.N.U.M.A.N ... Healing and Nurturing Units for Monitoring, Aid and Nursing of Wildlife ) బృందాలను సమస్యాత్మక ప్రాంతాల్లో మోహరించాలి" అని అధికారులకు స్పష్టం చేశారు.

ఏనుగుల దాడుల్లో పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. పంట నష్టంపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలు రూపొందించిన వెంటనే, అటవీశాఖ నిబంధనల ప్రకారం బాధితులకు తక్షణమే పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలు కూడా భయాందోళనలకు గురికాకుండా, ధైర్యంగా ఉంటూ అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని, ఏనుగులు కనిపించిన వెంటనే అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో అటవీశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు ముమ్మరం చేశారు.
Advertisement
Pawan Kalyan
Chandragiri Elephant Menace
Tirupati Forest Department
Andhra Pradesh Wildlife Safety
HANUMAN Wildlife Monitoring
Farmer Crop Compensation

More Telugu News