టీడీపీ పండుగ మహానాడు నేటి నుంచే.. 1,700 మంది పోలీసులతో భారీ భద్రత
- ఈరోజు, రేపు అట్టహాసంగా జరగనున్న మహానాడు
- రెండు రాష్ట్రాల నుంచి 15 వేల మంది ప్రతినిధులకు ఆహ్వానం
- తొలిరోజు 30 నుంచి 40 వేల మంది హాజరయ్యే అవకాశం
మహానాడుకు తెలుగు రాష్ట్రాల నుంచి 15 వేల మంది ప్రతినిధులకు ప్రత్యక్షంగా ఆహ్వానం అందింది. తొలిరోజు 30 నుంచి 40 వేల మంది వరకు పార్టీ కార్యకర్తలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. 50 వేల మందికి నోరూరించే వంటకాలను సిద్ధం చేస్తున్నారు. ప్రతినిధులకు కేటాయించిన స్థలంలో 15 వేల మంది కూర్చోవడానికి ఏర్పాట్లు చేశారు. పసుపురంగు డేరాలు, ఆకుపచ్చని కార్పెట్లతో ప్రాంగణం సుందరంగా ముస్తాబయింది.
పార్టీ అధినేత చంద్రబాబు తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పిస్తారు. అనంతరం ప్రతినిధుల రిజిస్టర్ లో సంతకం చేస్తారు. ఆ తర్వాత నేతలంతా ఆయనను అనుసరిస్తారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి, మహానాడును ప్రారంభిస్తారు. మరోవైపు మహానాడుకు 1,700 మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.