Advertisement

ఇలాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండకూడదు: సీఎం చంద్రబాబు

People who do not respect mother and sister should not be in politics says CM Chandrababu Naidu
  • తల్లి, చెల్లిని గౌరవించని వారు రాజకీయాలకు అనర్హులన్న సీఎం
  • డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యను ప్రస్తావిస్తూ గత పాలనపై విమర్శలు
  • పిల్లలకు చదువును మించిన గొప్ప ఆస్తి మరొకటి లేదని స్పష్టీకరణ
  • ప్రభుత్వ బడులపై నమ్మకంతో లక్షా పది వేల మంది చేరారని వెల్లడి
  • ఆగస్టు 1న ప్రధాని మోదీ చేతుల మీదుగా భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం
తల్లిని, సొంత చెల్లిని గౌరవించని వారు సమాజానికి ఏం మేలు చేస్తారని, అలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండటానికి అనర్హులని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కనీస విలువలు లేని వారు రాజకీయాల్లో కొనసాగడం ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని ఆయన అన్నారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌లో పాల్గొన్న చంద్రబాబు, గత ప్రభుత్వ హయాంలో అరాచకాలు జరిగాయంటూ ధ్వజమెత్తారు. ఈ నియోజకవర్గంలోనే ఒక దళిత డ్రైవర్‌ను దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన నేతలు రాజకీయం చేశారని, అలాంటి దుర్మార్గాలను ప్రజలు మరిచిపోకూడదని పిలుపునిచ్చారు. 

మంచిని ప్రోత్సహించి, చెడును నిలదీసినప్పుడే సమాజంలో మార్పు వస్తుందని ఆయన స్పష్టం చేశారు. తాము రాష్ట్రాభివృద్ధి కోసం ప్రధాని మోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో కలిసి కూటమిగా పనిచేస్తుంటే, కొందరు మాత్రం కేవలం బురదజల్లే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. మెగా డీఎస్సీ ద్వారా వేలాది మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పిస్తే, దానిపైనా విమర్శలు చేస్తూ నియామకమైన టీచర్ల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని, అధికారులు గానీ, నేతలు గానీ ఎవరైనా తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ సందర్భంగా విద్యా వ్యవస్థ ప్రాధాన్యతను వివరిస్తూ.. పిల్లలకు తల్లిదండ్రులు ఇవ్వగలిగే శాశ్వతమైన, గొప్ప ఆస్తి చదువేనని చంద్రబాబు ఉద్ఘాటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, అందుకే విద్యాశాఖలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు. ప్రభుత్వ బడులపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని, అందుకే ఈ ఏడాది ప్రైవేట్ పాఠశాలల నుంచి లక్షా పది వేల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని అన్నారు.

పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని, అందుకే రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌లు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశాలకు తల్లులతో పాటు తండ్రులు కూడా తప్పనిసరిగా హాజరై తమ పిల్లల ప్రగతిని సమీక్షించుకోవాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులు మట్టిలో మాణిక్యాలని, వారికి సరైన అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సాధిస్తారని అన్నారు. 

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు హాస్టళ్లు, గురుకులాల్లో డైట్ ఛార్జీలను 10 శాతం పెంచామని, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఐఐటీ కోచింగ్ అందిస్తున్నామని తెలిపారు. ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించని గత ప్రభుత్వానికి భిన్నంగా తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ద్వారా వేలాది ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని గుర్తుచేశారు.

రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నప్పటికీ, సంక్షేమ పథకాలను ఆపలేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తల్లికి వందనం నిధులను ఇప్పటికే తల్లుల ఖాతాల్లో జమ చేశామని, ప్రతి నెలా ఒకటో తేదీనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దీపం-2.0 కింద గ్యాస్ సిలిండర్లు వంటి హామీలను నిలబెట్టుకుంటున్నామని అన్నారు. ఆగస్టు నుంచి 'సంజీవని' హెల్త్ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నామని, ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పారు.

సభలో పలువురు విద్యార్థులు తమ లక్ష్యాలు, ఆశయాలను వెల్లడించగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ వారిని అభినందించారు. తాను భవిష్యత్తులో ఐఏఎస్ అధికారిగా మారి ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేస్తానని చెప్పిన విద్యార్థి సాత్విక్‌ను సీఎం ప్రత్యేకంగా అభినందిస్తూ, అతని సంకల్పం తప్పకుండా నెరవేరుతుందని ఆకాంక్షించారు. "డేర్ టు డ్రీమ్... స్ట్రైవ్ టు అచీవ్" అనేది తాను ఎప్పుడూ చెప్పే సందేశమని పేర్కొన్న సీఎం... పిల్లలను ప్రోత్సహించడం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల బాధ్యత అని అన్నారు. విద్యార్థుల ఆలోచనలు, అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేలా వారితో నిరంతరం సంభాషించాలని సూచించారు.
Advertisement
Chandrababu Naidu
Mega Parent Teacher Meeting
Andhra Pradesh Education Reforms
Mega DSC Teacher Recruitment
Rampachodavaram Public Meeting
AP Welfare Schemes

More Telugu News