Vaishnav Tej: 'ఆదికేశవ'గా వైష్ణవ్ తేజ్ .. ఫస్టు గ్లింప్స్ రిలీజ్!

  • యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో 'ఆది కేశవ'
  • ఆలయం నేపథ్యంలో సాగే కథ 
  • కథానాయికగా అలరించనున్న శ్రీలీల
  • సంగీతాన్ని అందిస్తున్న జీవీ ప్రకాశ్ కుమార్ 
  • జులైలో సినిమా విడుదల  
Adikeshava Movie Update

వైష్ణవ్ తేజ్ హీరోగా శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి నాగవంశీ - సాయిసౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ను ఇంతవరకూ రివీల్ చేయలేదు. కొంత సేపటి క్రితం టైటిల్ తో పాటు ఫస్టు గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. 

ఈ సినిమాకి 'ఆదికేశవ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఒక క్వారీకి సమీపంలో ఒక శివాలయం ఉంటుంది. ఆ శివాలయాన్ని కూడా పడగొట్టడానికి కొంతమంది రంగంలోకి దిగుతారు. ఆ శివాయలం జోలికి వచ్చిన వారికి హీరో దేహశుద్ధి చేసి పంపిస్తాడు. ఇదే ఈ గ్లింప్స్ లో చూపించిన కంటెంట్.

రుద్రకాళేశ్వర్ రెడ్డి అనే పాత్రలో వైష్ణవ్ తేజ్ కనిపిస్తున్నాడు. గ్రామీణ నేపథ్యంలో ఈ కథ సాగనున్నట్టుగా తెలుస్తోంది. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో జోజు జార్జ్ .. అపర్ణ దాస్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను, జులైలో విడుదల చేయనున్నారు.

More Telugu News