రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేవరకూ అరువు అడగొద్దంటూ పోస్టర్
- మధ్యప్రదేశ్ లో ఓ పాన్ షాప్ లో ఏర్పాటుచేసిన యజమాని
- ఇప్పుడున్న పరిస్థితుల్లో రాహుల్ ప్రధాని కాలేడనే పోస్టర్ పెట్టినట్లు వెల్లడి
- ఓ కస్టమర్ ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారిన పోస్టు
ఛింద్వారా జిల్లా కర్బాలా చౌక్ లో మహమ్మద్ హుస్సేన్ కు ఓ పాన్ షాప్ ఉంది. తెలిసిన వారే కదా అనే ఉద్దేశంతో గతంలో చాలామందికి అరువు ఇచ్చానని, వారు తిరిగివ్వకపోవడంతో నష్టపోయానని హుస్సేన్ వివరించాడు. దీంతో అరువు ఇవ్వబోనంటూ ఇలా వింత పోస్టర్ ను ఏర్పాటు చేశానన్నాడు. అయితే, రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేడన్నది తన అభిప్రాయం కాదని హుస్సేన్ తేల్చిచెప్పాడు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ప్రధాని సీట్లో కూర్చునే పరిస్థితి లేదని వివరించాడు. వాస్తవానికి రాహుల్ ప్రధాని కావాలన్నదే తన కోరిక అని హుస్సేన్ చెప్పాడు.