Superstar: సూపర్ స్టార్ రజనీకాంత్ కు పుట్టిన రోజు శుభాకాంక్షల వెల్లువ

  • నేడు రజనీకాంత్ 72వ పుట్టిన రోజు
  • ధనుష్, రాఘవ లారెన్స్, కేఎస్ రవికుమార్ నుంచి శుభాకాంక్షలు
  • మీ ఆశీర్వచనాలతో జిగిర్ తండ షూటింగ్ ప్రారంభిస్తున్నామన్న లారెన్స్
Superstar Rajinikanth turns 72 Dhanush to Dulquer celebs flood Twitter with birthday wishes for Thalaivar

తమిళ సూపర్ స్టార్, అగ్ర నటుడు రజనీకాంత్ నేడు 72వ పుట్టిన రోజు (73వ వసంతంలోకి అడుగుపెట్టారు) జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు నటుడు, ఆయన అల్లుడు ధనుష్ సహా, ఎంతో మంది సెలబ్రిటీలు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 

రజనీకాంత్ పూర్తి పేరు శివాజీరావు గైక్వాడ్. ఆయన 1950 డిసెంబర్ 12న బెంగళూరులో జన్మించారు. జన్మతః మరాఠీ అయినప్పటికీ, కర్ణాటకలో పుట్టిపెరిగి, తమిళులకు ఆరాధ్య నటుడిగా ఎదిగారు. ఉత్తమ నటడిగా తన కెరీర్ లో ఎన్నో సినిమాలకు ఆయన రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి అవార్డులు అందుకున్నారు. ముఖ్యంగా 1984లో కలైమామణి, 2000లో పద్మ భూషణ్, 2016లో ఎన్టీఆర్ జాతీయ అవార్డు, పద్మ విభూషణ్, 2021లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులు ఆయన్ను వరించడం, ఆయన ప్రతిభకు నిదర్శనాలు. 

‘‘హ్యాపీ బర్త్ డే తలైవ’’ అంటూ ధనుష్ ఓ చిన్న ట్వీట్ తో శుభాకాంక్షలు చెప్పాడు. ప్రముఖ దర్శకుడు, నృత్య దర్శకుడు రాఘవ లారెన్స్ అయితే. ‘‘హ్యాపీ బర్త్ డే తలైవా! మీకు  మంచి ఆరోగ్యం ఇవ్వాలని రాఘవేంద్ర స్వామిని కోరుకుంటున్నాను. మీరు చాలా, చాలా కాలం పాటు జీవించి ఉండాలి. ఈ ప్రత్యేకమైన రోజున జిగిర్ తండ షూటింగ్ ను మీ ఆశీర్వచనాలతో ప్రారంభిస్తున్నాం. గురువే శరణం’’ అంటూ ట్వీట్ పెట్టాడు.

నటుడు, నిర్మాత దుల్కర్ సల్మాన్ రజనీకాంత్ ‘బాబా’ సినిమా పోస్టర్ ను పోస్ట్ చేస్తూ, శుభాకాంక్షలు తెలియజేశాడు. ‘‘హ్యాపీ బర్త్ డే సూపర్ స్టార్ రజనీకాంత్ సర్. మీరు మాకు ఎప్పుడూ స్ఫూర్తినీయులుగా ఉండాలి’’ అని ట్వీట్ పెట్టారు. గాయకుడు అనిరుధ్ రవిచందర్, డైరెక్టర్లు కేఎస్ రవికుమార్, నెల్సన్ దిలీప్ కుమార్ సహా ప్రముఖులు ఎందరో రజనీకాంత్ కు శుభాకాంక్షలు తెలిపారు.

More Telugu News