Team India: గాయంతోనూ రోహిత్ శర్మ వీరోచిత పోరాటం... అయినా, 5 రన్స్ తేడాతో టీమిండియా ఓటమి

Team India lost 2nd ODI despite Rohit Sharma heroics
షార్ట్స్‌లో చూడండి
బంగ్లాదేశ్ తో రెండో వన్డేలోనూ టీమిండియా ఓటమిపాలైంది. 272 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. బొటనవేలి గాయంతో చివర్లో బ్యాటింగ్ కు దిగిన కెప్టెన్ రోహిత్ శర్మ వీరోచిత పోరాటం వృథా అయింది. రోహిత్ శర్మ 28 బంతుల్లో 51 పరుగులు చేసి చివరి వరకు క్రీజులో నిలిచాడు. అతడి స్కోరులో 3 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. 

ఆఖర్లో 6 బంతుల్లో 20 పరుగులు చేయాల్సి ఉండగా, ముస్తాఫిజూర్ రెహ్మాన్ విసిరిన ఆ ఓవర్లో రోహిత్ శర్మ 2 ఫోర్లు, 1 సిక్స్ కొట్టి ఆశలు కల్పించాడు. చివరి బంతికి సిక్స్ కొడితే విజయం దక్కుతుందనగా, ముస్తాఫిజూర్ యార్కర్ వేయడంతో రోహిత్ శర్మ భారీ షాట్ కొట్టేందుకు సాధ్యపడలేదు. దాంతో టీమిండియా స్కోరు 266 పరుగుల వద్ద నిలిచిపోయింది. 

టీమిండియా స్కోర్ కార్డ్ చూస్తే... రోహిత్ శర్మ గాయం కారణంగా ఆసుపత్రికి వెళ్లడంతో విరాట్ కోహ్లీ ఓపెనర్ గా బరిలో దిగాడు. అయితే 5 పరుగులకే అవుటయ్యాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (8) సైతం విఫలం కావడంతో టీమిండియా 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ 11, కేఎల్ రాహుల్ 14 పరుగులకే వెనుదిరగడంతో టీమిండియా కష్టాలు రెట్టింపయ్యాయి. 

వన్ డౌన్ లో వచ్చిన శ్రేయాస్ అయ్యర్ 6 ఫోర్లు, 3 సిక్సులతో 82 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ (56) అర్ధసెంచరీతో రాణించాడు. అయ్యర్, అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నంతసేపు టీమిండియా ఇన్నింగ్స్ సజావుగానే సాగింది. వీరిద్దరూ అవుట్ కావడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. 

గాయం కారణంగా చివర్లో బ్యాటింగ్ కు దిగిన రోహిత్ ఎడాపెడా బాదుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. అప్పటికే 9 వికెట్లు పడిపోయినా రోహిత్ పోరాటం ఆపలేదు. కానీ ఇన్నింగ్స్ చివరిబంతిని ముస్తాఫిజూర్ తెలివిగా యార్కర్ వేయడంతో రోహిత్ సిక్స్ కొట్టేందుకు విఫలయత్నం చేశాడు. 

కాగా, ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ ను ఆతిథ్య బంగ్లాదేశ్ 2-0తో గెలుచుకుంది. ఇక, ఇరుజట్ల మధ్య మూడో వన్డే నామమాత్రం కానుంది. ఈ మ్యాచ్ డిసెంబరు 10వ తేదీ చట్టోగ్రామ్ లో జరగనుంది.
Go Back to Shorts
Team India
Bangladesh
2nd ODI
Rohit Sharma
ODI Series

More Telugu News