vivek agnihotri: కశ్మీరీ ఫైల్స్ డైరెక్టర్ కొత్త సినిమా.. వివరాలివిగో!

  • కరోనా టీకా నేపథ్యంలో వివేక్ అగ్నిహోత్రి కొత్త ప్రాజెక్టు
  • త్వరలోనే సెట్స్ పైకి ‘ది వ్యాక్సిన్ వార్’
  • వచ్చే ఏడాది ఆగస్టులో పదకొండు భాషల్లో విడుదల
  • సోషల్ మీడియాలో వివరాలు పంచుకున్న అగ్నిహోత్రి
kashmiri files director vivek agnihotri new project details

చిన్న సినిమాగా విడుదలైన కశ్మీర్ ఫైల్స్ సినిమా దేశమంతటా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. కశ్మీరీ పండిట్ల ఊచకోత నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించారు. ఎన్నో వివాదాలు చుట్టుముట్టినా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా వసూళ్లలోనూ రికార్డులు కొల్లగొట్టింది. ఈ హిట్ తో వివేక్ అగ్నిహోత్రి దేశవ్యాప్తంగా పాప్యులర్ అయ్యారు. కశ్మీరీ ఫైల్స్ తర్వాత తన కొత్త ప్రాజెక్టు వివరాలను వివేక్ అగ్నిహోత్రి తాజాగా ప్రకటించారు. కరోనా టీకా నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు పోస్టర్ ద్వారా తెలుస్తోంది. కాగా, ‘మనకు తెలియని యుద్ధంలో పోరాడాం. చివరకు గెలిచాం’ అని ఈ పోస్టుకు వివేక్‌ రంజన్‌ క్యాప్షన్‌ ఇచ్చారు.

‘ది వ్యాక్సిన్‌ వార్‌’ పేరుతో నిర్మిస్తున్న సినిమా పోస్టర్ ను వివేక్ అగ్నిహోత్రి సోషల్ మీడియాలో విడుదల చేశారు. వచ్చే ఏడాది ఆగస్టులో స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీనిని హిందీతో పాటు తెలుగు, మరాఠీ, తమిళ, కన్నడ సహా మొత్తం పదకొండు భాషల్లో నిర్మిస్తున్నట్లు తెలిపారు. కశ్మీరీ ఫైల్స్ తర్వాత అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై కాంబినేషన్ తో ఈ సినిమాను తీసుకొస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ సినిమా నటీనటులు, ఇతర వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపారు.

More Telugu News