పంత్ వీరోచిత సెంచరీ... చివరి వన్డేలో గెలుపుతో సిరీస్ టీమిండియా కైవసం
- మూడో వన్డేలో టీమిండియా 5 వికెట్లతో విజయం
- సొంతగడ్డపై ఇంగ్లండ్ కు భంగపాటు
- వన్డే సిరీస్ 2-1తో టీమిండియా వశం
- 113 బంతుల్లో 125 పరుగులు చేసిన పంత్
- విల్లీ బౌలింగ్ లో వరుసగా 5 ఫోర్లు కొట్టిన వైనం
260 పరుగుల లక్ష్యఛేదనలో ఓ దశలో టీమిండియా టాపార్డర్ చేతులెత్తేసినా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యాతో కలిసి స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. పిచ్ బ్యాటింగ్ కు ఏమాత్రం సహకరించకపోయినా, ఏ దశలోనూ ఒత్తిడికి లోనుకాకుండా పని ముగించాడు. చివర్లో డేవిడ్ విల్లీ విసిరిన ఓవర్లో పంత్ వరుసగా 5 ఫోర్లు కొట్టడం హైలైట్ గా నిలిచింది.
పాండ్యా 55 బంతుల్లో 10 ఫోర్లతో 71 పరుగులు చేశాడు. పాండ్యా అవుటైన తర్వాత రవీంద్ర జడేజా బరిలో దిగాడు. అతడు కూడా పరిస్థితికి తగ్గట్టుగా ఆడగా, మరో ఎండ్ లో పంత్ విజృంభించాడు. దాంతో టీమిండియా సునాయాసంగా గెలుపు తీరాలకు చేరింది.