Telangana: రేపొద్దున్న బీజేపీ, టీఆర్ఎస్ చేతులు కలిపితే మాలాంటోళ్ల పరిస్థితి ఏంటి?: నడ్డాతో ఈటల

  • బీజేపీ-టీఆర్ఎస్ ఒకటేనని ప్రజలు భావిస్తున్నారు
  • రాష్ట్రంలోని కుంభకోణాలపై కేంద్రం స్పందించడం లేదన్న ఈటల
  • టీఆర్ఎస్‌తో పోరు కొనసాగుతుందన్న నడ్డా
  • రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా
Etela Rajender meet JP Nadda in Delhi

బీజేపీలో తన చేరికను దాదాపు ఖాయం చేసుకున్న తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ నిన్న సాయంత్రం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈటల పలు సందేహాలు లేవనెత్తారు.

 తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ ఒకటేనన్న భావన ప్రజల్లో ఉందని అన్నారు. భవిష్యత్తులో రెండు పార్టీలు కలిసి పనిచేస్తే పార్టీనే నమ్ముకుని వచ్చిన తమలాంటి వారి పరిస్థితి ఏమిటని ఈటల ప్రశ్నించినట్టు సమాచారం. రాష్ట్రంలో అనేక కుంభకోణాలు జరుగుతున్నాయని, అయినప్పటికీ కేంద్రం ఇప్పటి వరకు ఒక్క విచారణ కూడా చేపట్టకపోవడాన్ని ప్రజలు అనుమానిస్తున్నారని అన్నారు.

ఈటల సందేహాలకు నడ్డా బదులిచ్చారు. ఇందుకు పశ్చిమ బెంగాల్‌ను ఉదాహరణగా పేర్కొన్నారు. అక్కడ మూడు స్థానాల నుంచి దాదాపు అధికారం చేజిక్కించుకునే వరకు ఎదిగామని, తెలంగాణలోనూ అంతకుమించిన దూకుడు ప్రదర్శిస్తామని చెప్పారు. సమయం వచ్చినప్పుడు కుంభకోణాలపై విచారణ చేపడతామన్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలను తొలుత విమర్శించే కేసీఆర్ ఆ తర్వాత వాటిని అమలు చేస్తున్నారని, అలా ఎందుకో ప్రతిపక్షాలే ప్రశ్నించాలని నడ్డా అన్నారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో టీఆర్ఎస్‌తో బీజేపీ పోరు కొనసాగిస్తుందని తేల్చి చెప్పారు.

More Telugu News