అక్రమాలను అడ్డుకోలేని ఎన్నికల కమిషన్ ఎందుకు?: చంద్రబాబు

Chandrababu questions Election Commission role
  • ముగిసిన మూడో విడత పంచాయతీ ఎన్నికలు
  • కుప్పం నియోజకవర్గంలో వైసీపీ మద్దతుదారుల హవా
  • చంద్రబాబుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు
  • వైసీపీ అక్రమాలకు పాల్పడిందన్న చంద్రబాబు
  • ఆధారాలు సమర్పించినా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోలేదని ఆరోపణ
ఏపీలో నిన్న జరిగిన మూడో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కుప్పం చంద్రబాబు సొంత నియోజకవర్గం కాగా, అక్కడ 89 పంచాయతీలకు గాను 79 పంచాయతీల్లో వైసీపీ మద్దతుదారులే నెగ్గారు. దాంతో చంద్రబాబు సొంతనియోజకవర్గంలోనే టీడీపీ కుప్పకూలిపోయిందని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
కుప్పంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని, వీటిపై తాము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని అన్నారు. డబ్బు పంపిణీ సహా అనేక అక్రమాలపై ఆధారాలు అందించినా ఎన్నికల కమిషన్ పట్టించుకోకపోవడం దారుణమని పేర్కొన్నారు. అక్రమాలను అడ్డుకోలేని ఎన్నికల కమిషన్ ఎందుకని అన్నారు. కోర్టు ఆదేశాల మేరకు కౌంటింగ్ ప్రక్రియను ఎందుకు రికార్డు చేయలేదని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. డబుల్ డిజిట్ ఓట్ల మెజారిటీతో గెలిచిన ప్రాంతాల్లో రీకౌంటింగ్ ఎందుకు చేశారని నిలదీశారు. పలు ప్రాంతాల్లో రాత్రి 10 గంటల తర్వాత ఫలితాలు మార్చేశారని చంద్రబాబు ఆరోపించారు.

కుప్పంలో తాము గెలవకపోవడం కాదని ప్రజాస్వామ్యమే ఓడిందని అన్నారు.  కుప్పంతో తనకు మూడున్నర దశాబ్దాల అనుబంధం ఉందని, అక్కడి ప్రజలు తనను ఓ కుటుంబ సభ్యుడిలా భావిస్తారని వెల్లడించారు. శాంతికి పర్యాయపదంలా నిలిచే కుప్పంలో కోట్ల రూపాయలు డబ్బులు పంచారని ఆరోపించారు. శాంతియుత ప్రాంతాన్ని కలుషితం చేశారని విమర్శించారు.

ఇతర ప్రాంతాల్లో ఎన్నికల సరళిపై స్పందిస్తూ... తొలి రెండు విడతల కంటే మూడో విడతలో అత్యధికంగా టీడీపీకి సర్పంచ్ స్థానాలు వచ్చాయని తెలిపారు. వలంటీర్లు, అధికారులు సైతం బెదిరింపులకు పాల్పడ్డారని, పోలీసులకు పోలింగ్ బూత్ లోపల ఏం పని? అని ప్రశ్నించారు.
Go Back to Shorts
Chandrababu
Election Commission
Kuppam
Gram Panchayat Elections
Telugudesam
YSRCP

More Telugu News