సీసీబీ పోలీసుల విచారణ అనంతరం అజ్ఞాతంలో శాండల్‌వుడ్ నటి రాధికా కుమారస్వామి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సీసీబీ పోలీసుల విచారణ అనంతరం అజ్ఞాతంలో శాండల్‌వుడ్ నటి రాధికా కుమారస్వామి

Sandalwood Actress Radhika Disappear from Friday
  • సోదరుడితో కలిసి విచారణకు హాజరైన రాధిక
  • శుక్రవారం సాయంత్రం నుంచి అజ్ఞాతంలోకి
  • స్వామి సేవాలాల్ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి
  • అతడితో తమకు సంబంధం లేదన్న మంత్రులు
నగదు అక్రమ లావాదేవీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న శాండల్‌వుడ్ నటి రాధికా కుమారస్వామి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఈ కేసులో సోదరుడు రవిరాజ్‌తో కలిసి శుక్రవారం సీసీబీ విచారణకు హాజరైన ఆమె, ఆ రోజు రాత్రి నుంచి కనిపించడం లేదన్న వార్త కలకలం రేపుతోంది. మరోవైపు, మాజీ మంత్రి మురుగేశన్ నిరాణిని రాధిక కలిసినట్టుగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, అవి పాత ఫొటోలు అని పోలీసులు చెబుతున్నారు.

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసం చేసిన ఆరోపణలపై గతేడాది డిసెంబరులో యువరాజ్ (52) అలియాస్ స్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరెస్సెస్ కార్యకర్తగా చెప్పుకుంటూ ఆయనీ మోసాలకు  పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు నటి రాధిక కుమారస్వామి, యువరాజ్ మధ్య రూ. 75 లక్షల లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. దీంతో తాజాగా, ఆమెను విచారించి పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు.

యువరాజ్ తనకు గత 17 ఏళ్లుగా తెలుసని, ఆయన తమ కుటుంబ జ్యోతిష్యుడని ఇటీవల రాధిక చెప్పుకొచ్చారు. తన కెరియర్, జీవితం, తన తండ్రి మరణం గురించి ఆయన చెప్పినవన్నీ నిజమయ్యాయని పేర్కొన్నారు. గతేడాది అతడి అరెస్ట్ విషయం తెలిసి షాకయ్యానని పేర్కొన్నారు.  గతేడాది డిసెంబరు 16న యువరాజ్ నివాసంపై దాడులు చేసిన సీసీబీ అధికారులు రూ. 91 కోట్ల విలువైన 100 చెక్కులను స్వాధీనం చేసుకున్నారు.  

యువరాజ్‌కు సొంత ప్రొడక్షన్ కంపెనీ ఉందని, ఓ చారిత్రక సినిమాలో ప్రధాన పాత్ర పోషించాలని తనను అడిగారని రాధిక తెలిపారు. తాను వెంటనే అంగీకరించానని చెప్పారు. దీంతో అడ్వాన్స్‌గా రూ. 15 లక్షలు పంపిస్తానని చెప్పి తన ఖాతాలోకి బదిలీ చేశారని విచారణ అనంతరం పేర్కొన్నారు. మిగతా సొమ్ము గురించి ప్రశ్నించగా, యువరాజ్ బావమరిది ఖాతా నుంచి మరో రూ. 60 లక్షలు తన ఖాతాకు ట్రాన్స్‌ఫర్ అయినట్టు రాధికా కుమారస్వామి వివరించారు.  

యువరాజ్ అలియాస్ స్వామి సేవాలాల్‌ అరెస్ట్ అనంతరం పోలీసులు జరిపిన దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. భారీ బడ్జెట్, పెద్ద ప్రొడక్షన్‌లలో నటించే అవకాశం కల్పిస్తానంటూ 8 మంది యువ కథానాయికలు, ఇద్దరు స్టార్ హీరోయిన్లను ఆయన పలుమార్లు కలిసినట్టు పోలీసులు గుర్తించారు. వీరిని అడ్డంపెట్టుకుని రాజకీయ నాయకులు, సంపన్నులతో వంచన వ్యూహాలు రూపొందించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. జ్యోతిష్యం పేరుతో పలువురు దర్శకులు, నిర్మాతలు, నటులను అతడు వంచించినట్టు కాల్‌డేటా ఆధారంగా గుర్తించారు.

మరోవైపు, స్వామి సేవాలాల్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని కర్ణాటక హోం మంత్రి బసవరాజ బొమ్మై, కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషి, ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవది తదితరులు స్పష్టం చేశారు.
Radhika Kumara Swamy
Sandalwood
Bengaluru
CCB

More Telugu News