Kangana Ranaut: 'తలైవి' షూటింగ్‌ పూర్తయిన నేపథ్యంలో కంగనా రనౌత్ భావోద్వేగభరిత ట్వీట్

  • తలైవి వంటి పాత్రలో నటించే అవకాశం చాలా అరుదుగా దొరుకుతుంది
  • ఈ పాత్ర ప్రేమలో నేను పడిపోయా
  • ఇది విప్లవ నాయకురాలి పాత్ర
  • సినిమా యూనిట్‌ను వదిలిపోతుండడం బాధగా ఉంది
shooting completed says kangana

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయ‌ల‌లిత జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న 'తలైవి' సినిమాలో హీరోయిన్ కంగన ర‌నౌత్ నటిస్తున్న విషయం విదితమే. ఈ మూవీ షూటింగులో తీసుకున్న పలు ఫొటోలను ఇప్పటికే కంగనా రనౌత్ ట్విట్టర్ ‌లో పోస్ట్ చేసింది. అచ్చం జయలలితలా చీర కట్టుకొని, నుదుటిపై బొట్టు పెట్టుకుని సంప్రదాయబద్ధంగా ఆమె కనపడిన తీరు ప్రేక్షకులను ఆకర్షించింది.

ఈ సినిమా గురించి కంగనా తాజాగా మరో విషయం తెలిపింది. దర్శకుడు‌ ఏఎల్ విజయ్‌ రూపొందిస్తోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని చెప్పింది. ఈ సందర్భంగా ఆమె భావోద్వేగభరిత వ్యాఖ్యలు చేసింది. ఇటువంటి పాత్రలో నటించే అవకాశం చాలా అరుదుగా దొరుకుతుందని తెలిపింది. ఈ పాత్రతో తాను ప్రేమలో పడిపోయానని, ఇది విప్లవ నాయకురాలి పాత్ర అని ఆమె చెప్పింది.

ఈ సినిమా షూటింగ్‌ పూర్తయ్యిందని, దర్శకుడు‌ విజయ్‌తో పాటు ఈ చిత్ర యూనిట్ విష్ణు ఇందూరి, శైలేష్‌ ఆర్‌.సింగ్, విజయేంద్ర ప్రసాద్‌, బృంద ప్ర‌సాద్‌ వంటి అందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ఇటువంటి సినిమా యూనిట్‌ను వదిలిపోతుండడం బాధగా ఉందని చెప్పింది.  ఈ నేపథ్యంలో అన్ని భావోద్వేగాలు తనలో ఉన్నాయని తెలిపింది. ఈ సందర్భంగా జయలలిత ఫొటోతో పాటు జయలలిత పాత్రలోని తన ఫొటోను ఆమె పోస్ట్ చేసింది.

More Telugu News