రిలయన్స్ పరం కానున్న టిక్ టాక్ భారత విభాగం!

Reliance Intrest to Buy Tiktok
  • టిక్ టాక్ తో రిలయన్స్ ప్రాధమిక చర్చలు
  • స్వయంగా పాల్గొన్న టిక్ టాక్ భారత సీఈఓ
  • అమెరికా వ్యాపారంమై కన్నేసిన మైక్రోసాఫ్ట్
ఇండియాలో చైనాకు చెందిన బైట్ డాన్స్ అనుబంధ సోషల్ మీడియా వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ ను నిషేధించిన తరువాత, ఆ సంస్థ కార్యకలాపాలను కొనుగోలు చేసేందుకు పలు కంపెనీలు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ టిక్ టాక్ ను సొంతం చేసుకునే ఆలోచనలో ఉన్నారని, ఇప్పటికే బైట్ డ్యాన్స్ తో ప్రాధమిక చర్చలు సైతం పూర్తయ్యాయని ఓ వార్త వచ్చింది. ఇరు కంపెనీల అధికారుల మధ్య ధర విషయమై చర్చలు సాగుతున్నాయని సమాచారం.

ఇండియాలో తమ మొత్తం వ్యాపారాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ కు విక్రయించేందుకు బైట్ డ్యాన్స్ సైతం సుముఖంగానే ఉందని ఈ విషయంలో టిక్ టాక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెవిన్ మేయర్ స్వయంగా ఆర్ఐఎల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ లతో చర్చించారని, దాదాపు నెల రోజుల క్రితమే చర్చలు ప్రారంభమైనా, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని 'టెక్ క్రంచ్' తన ప్రత్యేక రిపోర్టులో పేర్కొంది.

ఇక టిక్ టాక్ భారత విభాగాన్ని సొంతం చేసుకోనుందన్న వార్తలపై అధికారికంగా స్పందించేందుకు రిలయన్స్ నిరాకరించింది. కాగా, సెప్టెంబర్ 15కు లోపే టిక్ టాక్ అమెరికా వ్యాపారాన్ని అమ్మేసుకోవాలని ఆ తరువాత, చైనా మాతృసంస్థతో ఏ విధమైన లావాదేవీలనూ అనుమతించేది లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పిన సంగతి విదితమే. టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్ యూఎస్ టిక్ టాక్ బిజినెస్ ను కొనుగోలు చేయాలన్న ఆసక్తితో ఉన్నట్టు తెలుస్తోంది.

జూన్ నెలలో సరిహద్దుల వద్ద చైనా, దురాక్రమణకు దిగడం, చైనా దాడిలో 20 మందికి పైగా భారత జవాన్లు మరణించడంతో దేశవ్యాప్తంగా చైనా ఉత్పత్తుల నిషేధానికి ఉద్యమం రాగా, అదే నెల 29న టిక్ టాక్, షేరిట్ సహా 58 యాప్ లను భారత్ లో వాడటాన్ని కేంద్రం నిషేధించిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Reliance
Mukesh Ambani
Tiktok
Bite Dance
Microsoft
RIL

More Telugu News