Chandrababu: బాలికపై అత్యాచారానికి పాల్పడి.... పోలీసులనే సవాల్ చేశారు: చంద్రబాబు

Chandrababu comments attacks on women in state
షార్ట్స్‌లో చూడండి
రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. దిశ చట్టం చేశామని కోట్ల ప్రజాధనంతో ప్రచారం చేసుకున్న ప్రభుత్వం... ఆఖరికి అమలు విషయానికి వచ్చేసరికి ఆ చట్టానికి దిక్కులేకుండా చేసిందని విమర్శించారు. మహిళలకు రక్షణ కల్పించాలన్న చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉంటే ఈ వరుస అత్యాచారాలు ఎందుకు జరుగుతాయని మండిపడ్డారు. 14 నెలల్లో 400కి పైగా అత్యాచారాలు, 16 సామూహిక లైంగికదాడులతో రాష్ట్రంలో నేరగాళ్లు ఎంతగా పేట్రేగిపోతున్నారో అర్థమవుతోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజమండ్రిలో ఒక మైనర్ దళిత బాలికను 4 రోజుల పాటు నిర్బంధించి, సామూహిక అత్యాచారం జరిపారని, ఆ బాలికను చిత్రహింసలు పెట్టారని తెలిపారు. అత్యాచారానికి పాల్పడిన నిందితులే ఆ బాలికను పోలీస్ స్టేషన్ వద్ద వదిలేసి, తద్వారా పోలీసులనే సవాల్ చేశారని వెల్లడించారు. చిత్తూరు జిల్లా యేర్పేడు మండలంలో దళిత బాలిక, నెల్లూరు జిల్లా వెంకట్రావుపల్లెలో మరో అమ్మాయి, అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరో దళిత బాలిక, గుంటూరులో ముస్లిం బాలిక, నెల్లూరు మహిళపై అత్యాచారాలు... ఇప్పుడీ మైనర్ దళిత బాలికపై అత్యాచారం అంటూ ట్విట్టర్ లో స్పందించారు.

ఇవి కాకుండా, నెల్లూరులో మహిళా ఎంపీడీవోపై, చిత్తూరులో దళిత మహిళా డాక్టర్ పై దౌర్జన్యాలు, మాస్కు ధరించమన్నందుకు మహిళా ఉద్యోగినిపై ప్రభుత్వ కార్యాలయంలోనే దాడికి పాల్పడ్డారని, ఈ ఘటనలన్నీ ఏపీలో మహిళలపై అరాచకాలకు పరాకాష్ఠ అని విమర్శించారు. పాలకులు స్వంత ప్రయోజనాల కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తే ఇటువంటి దుష్ఫలితాలే కలుగుతాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పటికైనా నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బడుగు, బలహీన వర్గాల పేదల ధన, మాన ప్రాణాలకు రక్షణ కల్పించాలని తెలిపారు.
Go Back to Shorts
Chandrababu
Women
Attacks
Assaults
Andhra Pradesh
YSRCP

More Telugu News