రాజస్థాన్ యువకుడు, కశ్మీరీ యువతి... ఆర్టికల్ 370 రద్దు తరువాత తొలి వివాహం!
- ఇన్నాళ్లూ రాష్ట్రేతరులను వివాహమాడితే ప్రత్యేక హక్కులు కోల్పోయే కశ్మీర్ అమ్మాయి
- ఆర్టికల్ 370 రద్దు తరువాత మారిన నిబంధనలు
- ప్రేమజంట వివాహాన్ని ఘనంగా జరిపించేందుకు ఏర్పాట్లు
కాగా, వీరిద్దరికీ గతంలోనే పరిచయం ఉందని, ఆ పరిచయం ప్రేమగా మారగా, పరిస్థితులు కలిసి రావడంతో, వీరు పెళ్లికి సిద్ధమయ్యారని సమాచారం. వీరిద్దరి మధ్యా రెండేళ్లుగా ప్రేమ నడుస్తున్నప్పటికీ, పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. మోదీ సర్కారు పుణ్యమాని వీరు ఒకటి కానున్నారు.
రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్ కు చెందిన అక్షయ్, కొంతకాలం ముందు న్యూఢిల్లీలో ఉద్యోగం చేశాడు. అదే సమయంలో కశ్మీర్ కు చెందిన కామినీ రాజ్ పుత్, ఢిల్లీలోని తన అత్త నివాసంలో కొన్ని రోజులు గడిపింది. అప్పుడు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే, అమ్మాయికి ఉన్న ప్రత్యేక హక్కులను కోల్పోతుందని తల్లిదండ్రులు భయపడి పెళ్లికి అడ్డు చెప్పారు.
ఆర్టికల్ 370 రద్దుతో అడ్డంకులు తొలగిపోగా, సామాజిక వర్గాలు వేరైనా, ఇద్దరూ తమ పెళ్లికి కుటుంబ పెద్దలను ఒప్పించారు. ఇప్పుడు తామిద్దరమూ ఎంతో సంతోషంగా ఉన్నామని, మోదీ సర్కారుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామని అక్షయ్ అంటున్నాడు. వీరిద్దరికీ ఇప్పుడు ఎంగేజ్ మెంట్ జరుగగా, మరో రెండు వారాల్లో వివాహాన్ని వైభవంగా నిర్వహించాలని పెద్దలు నిశ్చయించారు.