ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా ప్రపంచకప్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. కెనడా, మెక్సికో, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నమెంట్‌కు సంబంధించిన కెనడా ప్రారంభోత్సవ వేడుకలు టొరంటోలోని బీఎంఓ ఫీల్డ్‌లో శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో బాలీవుడ్ స్టార్, కెనడాలో జన్మించిన నోరా ఫతేహి తన డ్యాన్స్ ప్రదర్శనతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

టోర్నమెంట్ అధికారిక గీతాల్లో ఒకటైన 'సిర్ సిర్' పాటకు నోరా ఫతేహి అద్భుతమైన డ్యాన్స్‌తో స్టేడియాన్ని హోరెత్తించింది. ఫ్రెంచ్ కళాకారుడు వెజెడ్రీమ్, బంగ్లాదేశ్-అమెరికన్ డీజే సంజోయ్‌తో కలిసి ఆమె చేసిన ప్రదర్శన ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. మొరాకో ఫుట్‌బాల్ అభిమానులు ఉపయోగించే 'గో, గో' అనే నినాదం స్ఫూర్తితో ఈ పాటను రూపొందించారు. అరబిక్, ఫ్రెంచ్, ఇంగ్లీష్ భాషల కలయికతో రూపొందిన ఈ పాట ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఏకం చేసేలా ఉందని నిర్వాహకులు తెలిపారు.

టొరంటోలోనే పుట్టి పెరిగిన నోరా ఫతేహి, తన సొంత నగరంలో ప్రపంచ వేదికపై ప్రదర్శన ఇవ్వడం విశేషం. ఇది తనకు చాలా ప్రత్యేకమైన సందర్భమని ఆమె పేర్కొంది. 22 ఏళ్ల వయసులో కెరీర్ కోసం భారత్‌కు వచ్చిన నోరా, బాలీవుడ్‌లో అగ్రతారగా ఎదిగింది. గతంలో 2022 ఖతార్ ప్రపంచకప్ ముగింపు వేడుకల్లోనూ ఆమె ప్రదర్శన ఇచ్చింది.

కెనడా, బోస్నియా హెర్జెగోవినా జట్ల మధ్య మ్యాచ్‌కు ముందు జరిగిన ఈ వేడుకల్లో అలనిస్ మోరిసెట్, అలెసియా కారా, మైఖేల్ బూబ్లే వంటి పలువురు అంతర్జాతీయ కళాకారులు కూడా పాల్గొన్నారు. మూడు దేశాల్లో జరుగుతున్న ఈ వరల్డ్ కప్ కోసం పలు ప్రారంభ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఒక రోజు ముందు మెక్సికోలో జరిగిన వేడుకల్లో షకీరా, బర్నా బాయ్ వంటి స్టార్లు ప్రదర్శన ఇచ్చారు. నోరా ప్రదర్శనకు అద్భుతమైన స్పందన వ‌చ్చింది. మొత్తం మీద క్రీడా, సాంస్కృతిక వేడుకల కలయికగా ఈ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది.