Amaravati: అమరావతిలో 500 ఎకరాలు కొన్న బాలకృష్ణ...'ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్' సంచలన కథనం

షార్ట్స్‌లో చూడండి
ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు బావమరిది, వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ, తన బంధువుతో కలిసి అమరావతి ప్రాంతంలో 500 ఎకరాలను కొనుగోలు చేశారని 'ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్' ప్రత్యేక కథనాన్ని ఈరోజు ప్రచురించింది. ఏపీకి రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ప్రకటించకముందే ఈ లావాదేవీలు జరిగాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించినట్టు పత్రిక కథనం.

ఇప్పటికే అమరావతి ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, మంత్రులు నారాయణ, నటుడు మురళీ మోహన్ హెరిటేజ్ సంస్థ వందల ఎకరాలను కొనుగోలు చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. "గుంటూరు - విజయవాడల మధ్య రాజధాని ఉంటుందని ప్రకటించక ముందే బాలకృష్ణ, తన బంధువుతో కలిసి 500 ఎకరాలను కొనుగోలు చేశారు. తెలుగుదేశం నేతలు ఎంతో మంది ఈ ప్రాంతంలో భూములను ముందే కొన్నారు. ఆ వివరాలన్నీ త్వరలోనే బయటకు వస్తాయి" అని వైసీపీ నేతలు అంటున్నారు.

కాగా, నిన్న పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, అమరావతిలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ ను బయటకు తెస్తామని వ్యాఖ్యానించారు. అమరావతిలో భూ సమీకరణ ఓ అతిపెద్ద స్కామ్ అని, తెలుగుదేశం నేతలు రహస్య ప్రమాణాన్ని మీరారని ఆయన ఆరోపించారు. ప్రపంచ బ్యాంకు సైతం ఈ విషయాలను గమనించిన తరువాతనే రాజధాని నిర్మాణానికి నిధులను ఇచ్చేది లేదని తేల్చి చెప్పిందని బొత్స వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత అమరావతి, భూ సమీకరణలపై ప్రభుత్వం తన నిర్ణయాలను ప్రకటిస్తుందని సమాచారం.
Go Back to Shorts
Amaravati
Telugudesam
Balakrishna
Lands

More Telugu News