vajpayee: మహోన్నత నేత వాజ్ పేయికి మహా నివాళి: పవన్ కల్యాణ్

షార్ట్స్‌లో చూడండి
బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి మృతిపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘మాజీ ప్రధాని, భారతరత్నఅటల్ బిహారి వాజ్ పేయి మహాభినిష్క్రమణం భారత దేశానికి తీరని లోటు. ఆయన మన మధ్య ఇక ఉండరన్న విషయం జీర్ణించుకోవడం సాధ్యం కానిది. వాజ్ పేయి మృతికి యావత్ జాతితోపాటు నేను దుఃఖపడుతున్నాను.

ఆయన ఒక వ్యక్తి కాదు..ఒక శక్తి. ప్రధాన మంత్రిగా మన దేశానికి ఆయన సాధించిపెట్టిన విజయాలు సర్వదా కీర్తించదగినవి. భారతదేశాన్ని అణుశక్తి దేశంగా ఆవిష్కరించడానికి ఆయన చూపిన వజ్ర సంకల్పం, దేశ రక్షణకు కవచంగా మారింది. శత్రువులు మనవైపు కన్నెత్తి చూడడానికి భయపడేలా చేసింది. ఆయన హయాంలో మన దేశం అన్ని రంగాలలోను అభివృద్ధి దిశగా పరుగులు పెట్టింది. విలువలతో కూడిన ఆయన రాజకీయం ఈనాటి రాజకీయనాయకులకు సర్వదా ఆచరణీయం. నిస్వార్ధ రాజకీయానికి నిలువెత్తు సాక్ష్యం ఆయన. వాజ్ పేయి రాజకీయ జీవిత ప్రయాణంలో కాంతులీనే కోణాలు ఎన్నో.. మేలి మలుపులు మరెన్నో.

బహు భాషా కోవిదుడైన వాజ్ పేయి ప్రసంగాలు రాజనీతి మేళవింపుగా ఎంత సేపు విన్నా వినాలనిపించేవిగా ఉంటాయి. కవిగా, రచయితగా ఆయన మనకు పంచిన కవితా సౌరభాలు చిరంతనంగా పరిమళిస్తూనే ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన భరతమాత ముద్దు బిడ్డగా పుట్టడం మన జాతి అదృష్టం. ఈ పుణ్య భూమికి ప్రధాన మంత్రిగా సేవలు అందిచడం మన భాగ్యం. రాజకీయ భీష్మునిగా కీర్తిని అందుకున్న వాజ్ పేయి చిరస్మరణీయుడు. ఆయనకు భరత జాతి ఎంతో రుణపడి వుంది. మహా మహోన్నతమైన వాజ్ పేయి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ.. ఆ మహా మనీషికి నా తరపున, ‘జనసేన’ శ్రేణుల తరపున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను’ అని పవన్ పేర్కొన్నారు.
Go Back to Shorts
vajpayee
Pawan Kalyan

More Telugu News