పేరు ఘనం - తీరు పేలవం: కోహ్లీ సేన ఇక ఇంటికేనా? అన్నది తేలేది నేడే!

  • నేడు హైదరాబాద్ లో సన్ రైజర్స్, రాయల్ చాలెంజర్స్ మధ్య పోరు
  • ఇప్పటికే వరుస విజయాలతో అగ్రస్థానంలో హైదరాబాద్ జట్టు
  • పరాజయాల నుంచి ఇంకా కోలుకోని కోహ్లీ సేన
నేడు ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా, మంచి ఊపుమీద ఉండి వరుస విజయాలతో ప్లే ఆఫ్ అవకాశాలను దాదాపు ఖాయం చేసుకున్న హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు, మరోపక్క పేలవమైన ఆటతీరు, వరుస ఓటములతో కొనసాగుతూ, ఆడిన 9 మ్యాచ్ లలో మూడే విజయాలతో ఆరో స్థానంలో ఉన్న బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టుతో తలపడనుంది. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ నాయకత్వంలో బరిలోకి దిగే బెంగళూరు జట్టు, ఈ మ్యాచ్ లో చేతులెత్తేస్తే ఆ జట్టు ఇక ఇంటికే.

ఇప్పటికే తానాడిన తొలి మూడు మ్యాచ్ లు, ఆపై ఒక మ్యాచ్ ఓడిపోయినా, నాలుగు వరుస విజయాలతో ఉన్న హైదరాబాద్ జట్టు ఈ ఒక్క మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్ మ్యాచ్ లను ఖాయంగా ఆడుతుంది. ఇదే సమయంలో కోహ్లీ సేన తాను ఆడాల్సిన మిగతా 5 మ్యాచ్ లూ గెలిస్తే మాత్రమే ప్లే ఆఫ్ కు చేరుతుంది. దీంతో ఈ మ్యాచ్ కోసం నగర క్రికెట్ ప్రేక్షకులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే టికెట్లన్నీ అమ్ముడుకాగా, స్టేడియం ప్రేక్షకులతో నిండిపోతుంది. ఇక్కడ కోహ్లీ అభిమానులు ఎక్కువగా ఉండటంతో నగరానికి కోహ్లీ ఫీవర్ పట్టుకుంది. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న కోహ్లీ సేన, ఉదయం నుంచి ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది. ఇక స్టేడియంలో ఎలానూ టాలీవుడ్ హీరోలతో పాటు కోహ్లీ భార్య అనుష్క శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారనడంలో సందేహం లేదు.

తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో నిన్న ముంబై ఇండియన్స్ చూపిన స్ఫూర్తినే నేడు కోహ్లీ సేన కూడా చూపిస్తే, ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద ఖాయం. ఈ మ్యాచ్ నేటి రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది.
Go Back to Shorts
Hyderabad
Bengalore
Virat Kohli
Anushka Shetty
IPL
Uppal
Stadium
Cricket

More Telugu News