ప్రముఖ తెలుగు న్యూస్ యాంకర్ రాధిక ఆత్మహత్య
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రముఖ తెలుగు న్యూస్ యాంకర్ రాధిక ఆత్మహత్య

  • ఆదివారం యథావిధిగా విధులకు
  • రాత్రి కార్యాలయం నుంచి రాగానే అపార్ట్‌మెంట్ పై నుంచి దూకి బలవన్మరణం
  • తన చావుకు ఎవరూ కారణం కాదంటూ సూసైడ్ నోట్
v6 ఛానల్ లో న్యూస్ యాంకర్‌గా పనిచేస్తున్న ప్రముఖ యాంకర్ రాధిక (30) ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కార్యాలయం నుంచి వచ్చిన కొద్ది సేపటికే ఆమె ఈ అఘాయిత్యం చేసుకున్నారు. హైదరాబాద్, ముసాపేట గూడ్స్ షెడ్ రోడ్డులోని సుశీల్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న ఆమె ఐదో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాకున్నా.. మానసిక ఒత్తిడితోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా నిర్ధారించారు.

గత ఐదేళ్లుగా ఇదే అపార్ట్‌మెంటులో ఉంటున్న ఆమె ఆరు నెలల కిందట భర్తతో విడాకులు తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం తండ్రి, చెల్లెలు, కుమారుడితో కలిసి ఉంటున్నారు. భర్త దూరం కావడంతో కొన్నాళ్లుగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన రాధిక ఆదివారం రాత్రి 10:30 గంటల సమయంలో ఆఫీసు నుంచి ఇంటికి వచ్చారు. ఆ తర్వాత కాసేపటికే పరుగుపరుగున అపార్ట్‌మెంట్ పైకి వెళ్లడాన్ని ఇరుగుపొరుగు వారు గమనించారు. కీడు శంకించి వారు పైకి వెళ్లేలోపే ఆమె పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.

‘‘నా చావుకు ఎవరూ కారణం కాదు.. నా మెదడే నా శత్రువు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను’’ అని రాసి ఉన్న సూసైడ్ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మానసిక ఒత్తిడి భరించలేకే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  
Radhika
News Anchor
Hyderabad
Suicide

More Telugu News