పోలీసుల కళ్లలో కారం చల్లి గ్యాంగ్‌స్టర్‌ను దర్జాగా విడిపించుకుపోయిన అనుచరులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పోలీసుల కళ్లలో కారం చల్లి గ్యాంగ్‌స్టర్‌ను దర్జాగా విడిపించుకుపోయిన అనుచరులు!

  • ఆసుపత్రి వద్ద కాపుకాసిన గ్యాంగ్‌స్టర్ అనుచరులు
  • బయటకు రాగానే పోలీసుల కళ్లలో కారం చల్లిన వైనం
  • కాల్పులు జరిపినా దొరకని నిందితులు
ఆసుపత్రికి తీసుకొచ్చిన గ్యాంగ్‌స్టర్‌ను అతడి అనుచరులు తెలివిగా తప్పించుకు తీసుకెళ్లారు. గేటు వద్ద కాపుకాసిన అతడి అనుచరులు పోలీసులు రాగానే వారి కళ్లలో కారం చల్లి తమ నాయకుడిని దర్జాగా విడిపించుకుని తీసుకెళ్లారు. ఢిల్లీలో జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. రిమాండ్ ఖైదీగా వున్న గ్యాంగ్‌స్టర్ సందీప్ కుమార్ అలియాస్ సంజయ్ అలియాస్ ధిలూ పంటి నొప్పితో బాధపడుతుండడంతో ఈనెల 9 న మౌలానా ఆజాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్‌కు తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు చిన్నపాటి సర్జరీ చేశారు. అతడిని డిశ్చార్జ్ చేస్తూ ఈనెల 19న మరోమారు రావాలని సూచించారు. దీంతో  సోమవారం ఏఎస్సై బ్రజ్ మోహన్, నరేశ్ పాల్, హెడ్‌కానిస్టేబుల్ యోగేందర్‌లు సందీప్‌ను ఆసుపత్రికి తీసుకొచ్చారు.

ఉదయం 11:15 గంటల ప్రాంతంలో ఆసుపత్రిలో చూపించుకుని బయటకు వస్తున్నప్పుడు గేటు దగ్గర కాపుకాసిన సందీప్ అనుచరులు ముగ్గురు పోలీసుల కళ్లలో కారం చల్లారు. కళ్లలో కారం పడడంతో విలవిల్లాడిపోతున్న పోలీసుల నుంచి తమ నాయకుడిని విడిపించుకుని స్కూటర్‌పై పారిపోయారు. అంతలోనే తేరుకున్న పోలీసులు వారిపై కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాల్పుల శబ్దానికి ఆసుపత్రిలోని రోగులు, వైద్యులు భయభ్రాంతులకు గురయ్యారు.

స్కూటరుపై పారిపోతున్న వారిని నిలువరించేందుకు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. రోడ్డు బిజీగా ఉండడంతో వారు తప్పించుకోగలిగారని తెలిపారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కాగా, తప్పించుకుపోయిన నిందితుడిపై మూడు హత్యకేసులు ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు.
Gangster
custody
chilli powder
New Delhi

More Telugu News