పాకిస్థాన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ హరీస్‌ రవూఫ్‌కు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) షాక్‌ ఇచ్చింది. మైదానంలో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు మ్యాచ్‌ ఫీజులో 20 శాతం జరిమానా విధించింది. అంతేకాదు.. అతడి ఖాతాలో మరో డీమెరిట్‌ పాయింట్‌ చేరింది. దీంతో మొత్తం పాయింట్లు ఐదుకు చేరాయి. ఇప్పటికే గతంలో నిషేధం ఎదుర్కొన్న రవూఫ్‌.. మరోసారి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. 

అసలేం జరిగింది?
ఇంగ్లండ్‌తో ఆదివారం లాహోర్‌లో జరిగిన వన్డేలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాకిస్థాన్‌ ఇన్నింగ్స్‌ 46వ ఓవర్‌ ముగిసిన సమయంలో వైడ్‌ కోసం రవూఫ్‌ అప్పీల్‌ చేశాడు. ఈ విషయంలో ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ విల్‌ జాక్స్‌తో వాగ్వాదానికి దిగాడు. అంపైర్‌ షర్ఫుద్దౌలా హెచ్చరించినా రవూఫ్‌ వెనక్కి తగ్గలేదు. బ్యాట్‌ పైకెత్తుతూ వాదన కొనసాగించాడు. జాక్స్‌ వైపు వెళుతూ అంపైర్‌ను తాకుతూ ముందుకు సాగాడు. ఈ వ్యవహారాన్ని ఐసీసీ తీవ్రంగా పరిగణించింది. 

ఐదు డీమెరిట్‌ పాయింట్లు
24 నెలల వ్యవధిలో రవూఫ్‌ మూడోసారి తప్పిదానికి పాల్పడ్డాడు. తాజా చర్యతో అతడి ఖాతాలో ఐదు డీమెరిట్‌ పాయింట్లు చేరాయి. ఐసీసీ నిబంధనల ప్రకారం ఈ వ్యవధిలో నాలుగు పాయింట్లు వస్తే రెండు సస్పెన్షన్‌ పాయింట్లుగా మారతాయి. దాని ప్రకారం ఒక టెస్టు లేదా రెండు వన్డేలు లేదా రెండు టీ20లపై నిషేధం పడుతుంది. ఎనిమిది డీమెరిట్‌ పాయింట్లకు చేరితే శిక్ష మరింత పెరుగుతుంది. 

ఇదే మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కూ జరిమానా పడింది. నిర్ణీత సమయంలో మూడు ఓవర్లు తక్కువగా వేసినందుకు ఆ జట్టు ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులో 15 శాతం కోత విధించారు. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌, రవూఫ్‌ తమపై వచ్చిన అభియోగాలను అంగీకరించడంతో అధికారిక విచారణ అవసరం లేకుండానే ఐసీసీ శిక్షలు ఖరారు చేసింది. 

ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ ఒక్క వికెట్‌ తేడాతో ఇంగ్లండ్‌పై గెలిచింది. షాదాబ్‌ ఖాన్‌ అజేయ సెంచరీకి తోడు చివరి వికెట్‌కు రవూఫ్‌తో కలిసి 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో పాకిస్థాన్‌ త్రైపాక్షిక వన్డే సిరీస్‌ ఫైనల్‌కు చేరింది. అక్టోబరు 31న లాహోర్‌లో శ్రీలంకతో తలపడనుంది.