దీపావళి ముంగిట కోట్లాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉద్యోగులకు కరవు భత్యం (డీఏ), పెన్షనర్లకు కరవు సహాయం (డీఆర్)పై కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్.. ఉద్యోగులకు అదనపు డీఏ, పెన్షనర్లకు డీఆర్ విడుదలకు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న 60 శాతం బేసిక్ పే/పెన్షన్‌పై అదనంగా 3 శాతం పెంపునకు అంగీకరించింది.

ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.10,016.10 కోట్ల అదనపు భారం పడనుందని కేబినెట్ ఒక ప్రకటనలో వెల్లడించింది. తాజా పెంపు 2026 జూలై 1 నుంచే అమల్లోకి వస్తుంది. పెరిగిన ధరల నుంచి ఉపశమనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ పెంపుతో మొత్తం డీఏ 63 శాతానికి చేరుతుంది. 7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల మేరకు ఆమోదించిన ఫార్ములా ప్రకారమే ఈ పెంపు ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 48.54 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.71 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు.

8వ వేతన సంఘంపై ఉద్యోగుల ఆశలు
మరోవైపు, 8వ కేంద్ర వేతన సంఘం వేతనాలు, పెన్షన్లకు సంబంధించిన అంశాలపై ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతోంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంజనా ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలోని ఈ కమిషన్‌లో మాజీ ఐఏఎస్ అధికారి పంకజ్ జైన్ (మెంబర్-సెక్రటరీ), ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యులు పులక్ ఘోష్ సభ్యులుగా ఉన్నారు. 

ఈ కమిటీ సిఫార్సులు కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాలపై ప్రభావం చూపనున్నాయి. వీరిలో సుమారు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లు (రైల్వే, రక్షణ రంగాలతో కలిపి) ఉన్నారు.

తదుపరి వేతన సవరణలో భాగంగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను అధికంగా నిర్ణయించాలని ఉద్యోగ సంఘాలు కమిషన్‌ను కోరుతున్నాయి. అలాగే, డీఏ ఫ్రేమ్‌వర్క్‌లో మార్పులు చేయాలని, నిర్ణీత పరిమితి దాటిన తర్వాత డీఏను మూల వేతనంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ సంప్రదింపుల ద్వారా వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని కమిషన్ తన సిఫార్సులను రూపొందించనుంది.