ఈడీ, సీబీఐ సరిపోక ఈసీని వాడుకుంటున్నారు: కేంద్రంపై రేవంత్ రెడ్డి ఫైర్
Add ap7am to your home Screen

ఈడీ, సీబీఐ సరిపోక ఈసీని వాడుకుంటున్నారు: కేంద్రంపై రేవంత్ రెడ్డి ఫైర్

Revanth Reddy slams Centre for misusing Election Commission along with ED and CBI
  • కేంద్ర ప్రభుత్వం ఈసీని దుర్వినియోగం చేస్తోందన్న సీఎం రేవంత్
  • ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ పేరుతో బీజేపీ వ్యతిరేకుల ఓట్ల తొలగిస్తున్నారని ఆరోపణ
  • సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలు సరిపోవన్నట్లుగా ఇప్పుడు మోదీ సర్కార్ ఎన్నికల కమిషన్‌ను (ఈసీ) కూడా దుర్వినియోగం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియను అడ్డం పెట్టుకుని బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నవారి ఓట్లను తొలగించే బాధ్యతను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు అప్పగించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 1950లో ప్రజలకు ఓటు హక్కు కల్పించడానికి తీసుకొచ్చిన ఈ ప్రక్రియను, ఇప్పుడు బీజేపీ తన వ్యతిరేకుల ఓట్లను తొలగించడానికి వాడుకుంటోందని విమర్శించారు. ఈ చర్యల ద్వారా.. బీజేపీని వ్యతిరేకించే యువత, నిరుద్యోగులు, పేదలను లక్ష్యంగా చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు.

ఈసీలోని మిగతా ఇద్దరు కమిషనర్లు ఎస్ఐఆర్ ప్రక్రియలోని లోపాలను వ్యతిరేకించారని, దీనివల్ల జ్ఞానేశ్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలు బయటపడ్డాయని రేవంత్ రెడ్డి తెలిపారు. అలాంటి అధికారిని తొలగించడానికి ప్రధాని నరేంద్ర మోదీకి అభ్యంతరం ఎందుకని ఆయన ప్రశ్నించారు. బీజేపీ మత, ప్రాంతీయ ప్రాతిపదికన ప్రజలను విభజించి, ధనవంతులు-బీజేపీ మద్దతుదారులు ఒకవైపు, పేదలు-గిరిజనులు-బీజేపీ వ్యతిరేకులు మరోవైపు అనేలా రెండు వర్గాలుగా చూస్తోందని ఆరోపించారు.

ఈ పరిస్థితిని మరో స్వాతంత్య్ర సంగ్రామంగా అభివర్ణించిన రేవంత్, రాహుల్ గాంధీ చేపట్టిన 'జ్ఞానేశ్ కుమార్ గో బ్యాక్' ఉద్యమం దేశాన్ని కాపాడుతుందని అన్నారు. గతంలో జ్ఞానేశ్ కుమార్ నియామకాన్ని రాహుల్ గాంధీ వ్యతిరేకించిన విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.

Advertisement
Revanth Reddy
Election Commission of India
Gyanesh Kumar CEC
Voter List Revision
BJP
Telangana CM

More Telugu News