పట్టణ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్
Add ap7am to your home Screen

పట్టణ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్

AP Government issues key orders on BC reservations in urban local bodies
  • పట్టణ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం కొత్త జీవో జారీ 
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కలిపి 50 శాతం మించకూడదని స్పష్టీకరణ
  • మేయర్లు, ఛైర్‌పర్సన్లు, వార్డు సభ్యుల స్థానాలకు రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు
  • సుప్రీంకోర్టు 'ట్రిపుల్ టెస్ట్' ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేసిన సర్కార్
  • డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేస్తూ కూటమి ప్రభుత్వం శనివారం నూతన మార్గదర్శకాలతో ఉత్తర్వులు జారీ చేసింది. 

ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కేటాయించే మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని ఈ జీవోలో స్పష్టంగా పేర్కొంది. సుప్రీంకోర్టు, ఏపీ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులకు అనుగుణంగా ఈ నిబంధనను తప్పనిసరి చేసింది. ఈ మేరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేశ్ కుమార్ జీవో ఎంఎస్ నంబర్-251ను విడుదల చేశారు.

రిజర్వేషన్ల ఖరారు కోసం సుప్రీంకోర్టు నిర్దేశించిన 'ట్రిపుల్ టెస్ట్' విధానాన్ని ప్రభుత్వం కచ్చితంగా పాటించింది. దీని కోసం గతంలో ఏర్పాటు చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన సిఫార్సులకు ఆమోదం తెలిపింది. 

యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, ఎస్‌జీఎస్‌డ‌బ్ల్యూ డేటా ఆధారంగా పట్టణ ప్రాంతాల్లో బీసీల జనాభాను గుర్తించి, వారి రాజకీయ ప్రాతినిధ్యం కోసం ఈ రిజర్వేషన్లను కేటాయించినట్లు ప్రభుత్వం వివరించింది. రిజర్వేషన్ల కేటాయింపులో మొదట ఎస్టీలకు, ఆ తర్వాత ఎస్సీలకు, చివరగా బీసీలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

మేయర్లు, మున్సిపల్ ఛైర్‌పర్సన్లు, వార్డు సభ్యుల స్థానాలకు రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు వర్తింపజేయనున్నారు. 2021లో అమలు చేసిన రిజర్వేషన్ సర్కిల్‌ను ఆధారంగా తీసుకుని తదుపరి రిజర్వేషన్లను ఖరారు చేయాలని ఆదేశించారు. అయితే, పునర్విభజన జరిగిన వార్డులలో మాత్రం రిజర్వేషన్ల సైకిల్ కొత్తగా ప్రారంభమవుతుందని జీవోలో పేర్కొన్నారు. 

గతంలో బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చిన జీవోను హైకోర్టు నిలిపివేసిన నేపథ్యంలో, న్యాయపరమైన చిక్కులు లేకుండా తాజా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మార్గదర్శకాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
Advertisement
Andhra Pradesh Government
BC Reservations
Urban Local Body Elections
Rajiv Ranjan Mishra Commission
AP Municipality Elections
Triple Test Method

More Telugu News