ఫ్రాన్స్‌లో విద్యార్థుల విప్లవం.. అట్టుడుకుతున్న వీధులు
Add ap7am to your home Screen

ఫ్రాన్స్‌లో విద్యార్థుల విప్లవం.. అట్టుడుకుతున్న వీధులు

France student protests escalate over education reforms and teacher shortages
  • పాఠశాలల్లో సౌకర్యాల కొరత
  • టీచర్ల నియామకానికి డిమాండ్
  • నిరసనలు హింసాత్మకం
  • వేల సంఖ్యలో విద్యార్థుల అరెస్ట్
  • ఉద్యమంలోకి చేరిన రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు
పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు, టీచర్ల నియామకం వంటి డిమాండ్లతో విద్యార్థులు చేపట్టిన నిరసనలతో ఫ్రాన్స్ దద్దరిల్లుతోంది.  15 నుంచి 18 ఏళ్లలోపు విద్యార్థులు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తుండటంతో దేశం అట్టుడుకుతోంది. సోషల్ మీడియా వేదికగా టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా వేగంగా వ్యాపించిన ఈ ఉద్యమం.. ఇప్పుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది.

గత నెల 21న పారిస్ సమీపంలోని ఓ పాఠశాలలో టీచర్ల కొరతను నిరసిస్తూ ఉపాధ్యాయులు చేపట్టిన ధర్నాకు విద్యార్థులు మద్దతు పలకడంతో ఈ ఉద్యమం మొదలైంది. ప్రభుత్వం తాత్కాలికంగా ఆ స్కూల్‌కు కొత్త టీచర్లను పంపినా, దేశంలోని ఇతర 'లీసే' (హైస్కూల్) పాఠశాలల్లోని విద్యార్థులు కూడా తమ సమస్యలపై గళం విప్పారు. పాఠశాలల్లో సరైన వసతులు లేకపోవడం, తరగతి గదుల్లో పరిమితికి మించి విద్యార్థులు ఉండటం, టీచర్ల వేతనాల్లో కోత విధించాలన్న ప్రభుత్వ ఆలోచన వంటివి విద్యార్థుల ఆగ్రహానికి ఆజ్యం పోశాయి.

ప్రశాంతంగా మొదలైన ఆందోళనలను అణచివేసేందుకు పోలీసులు ప్రయత్నించడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది. విద్యార్థులపై భాష్పవాయువు, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించడం, లాఠీఛార్జ్ చేయడంతో వారు మరింత రెచ్చిపోయారు. పలుచోట్ల పాఠశాల భవనాలకు నిప్పుపెట్టారు. ఇప్పటివరకు సుమారు 100 పాఠశాలలు ధ్వంసం కాగా, పోలీసులు దాదాపు 6,000 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో 87 శాతం విద్యార్థులేనని ప్రభుత్వం పేర్కొంది. పోలీసుల గ్రెనేడ్ దాడిలో ఓ విద్యార్థి చేయి కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

ఈ ఉద్యమంలోకి క్రమంగా వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు, రైతులు కూడా ప్రవేశించారు. ఇది విద్యార్థుల ఉద్యమం కాదని, ప్రతిపక్షాల రాజకీయ కుట్ర అని ప్రధాని సెబాస్టియన్ లీకార్ను ఆరోపించారు. మరోవైపు, ఈ హింసను అందరూ ఖండించాలని పిలుపునిస్తూనే, విద్యార్థుల డిమాండ్లను వినాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది దేశంలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామాలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Advertisement
France
Student Protests
Emmanuel Macron
Education Crisis
Paris School Riots
Teacher Shortage France

More Telugu News