25 ఏళ్లలో భారత్‌ దిశ మార్చారు.. మోదీపై సీఎం చంద్రబాబు ప్రశంసల జల్లు

25 ఏళ్లలో భారత్‌ దిశ మార్చారు.. మోదీపై సీఎం చంద్రబాబు ప్రశంసల జల్లు

  • ప్రజల విశ్వాసమే మోదీ బలమన్న సీఎం చంద్రబాబు
  • భారత్‌ మౌలిక వసతుల్లో వేగంగా ముందుకెళ్లిందని వెల్లడి
  • టెక్నాలజీ వినియోగంపై మోదీకి కితాబు
  • అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థలకు ప్రోత్సాహమని వెల్లడి
  • ప్రపంచ వేదికపై భారత్‌ ప్రభావం పెరిగిందని వ్యాఖ్య
  • ‘వికసిత్‌ భారత్‌ 2047’పై చంద్రబాబు విశ్వాసం
ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్లుగా ప్రభుత్వ పదవిలో కొనసాగడం అసాధారణ ప్రయాణమని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజల విశ్వాసమే ఆయన నాయకత్వానికి ప్రధాన బలమని పేర్కొన్నారు. 2026 అక్టోబర్‌ 7తో మోదీ ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘ది హిందూ’లో రాసిన వ్యాసంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

మోదీ రాజకీయాలతో మాత్రమే ఇంతకాలం నాయకత్వాన్ని కొనసాగించలేదని చంద్రబాబు అన్నారు. ప్రజల విశ్వాసాన్ని సంపాదించారని పేర్కొన్నారు. వ్యక్తిగత నిజాయతీ, క్రమశిక్షణ, పనితీరు ఆ విశ్వాసానికి కారణమని తెలిపారు.

మారుతున్న ప్రపంచంలో స్థిరమైన భారత్‌
ప్రపంచ ఆర్థిక సంక్షోభాలు, కరోనా మహమ్మారి, యుద్ధాలు, భౌగోళిక మార్పులు, సాంకేతిక విప్లవం, ఆర్థిక అనిశ్చితి మధ్య భారత్‌ స్థిరంగా ముందుకు సాగిందని చంద్రబాబు పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో మౌలిక వసతులు వేగంగా విస్తరించాయని, సంక్షేమ పథకాల అమలు బలోపేతమైందని తెలిపారు.

2014లో 91,287 కిలోమీటర్లుగా ఉన్న జాతీయ రహదారుల నెట్‌వర్క్‌ ఇప్పుడు 1.46 లక్షల కిలోమీటర్లు దాటిందన్నారు. విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 160కు పైగా పెరిగిందని తెలిపారు. పునరుత్పాదక విద్యుత్‌ సామర్థ్యం దాదాపు 296 గిగావాట్లకు చేరిందని వివరించారు.

టెక్నాలజీపై ప్రత్యేక దృష్టి
మోదీకి సాంకేతికతపై మంచి అవగాహన ఉందని చంద్రబాబు ప్రశంసించారు. డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ద్వారా బ్యాంకింగ్‌, సంక్షేమం, ప్రభుత్వ సేవలు ప్రజలకు వేగంగా చేరుతున్నాయని చెప్పారు. క్వాంటమ్‌ మిషన్‌, సెమీకండక్టర్‌ మిషన్‌, పీఎల్‌ఐ పథకాలు భారత్‌ను సాంకేతికంగా మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో భాగమన్నారు.

అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థలకు అవకాశం ఇవ్వడం వల్ల కొత్త తరం పారిశ్రామికవేత్తలకు అవకాశాలు పెరిగాయని తెలిపారు. కేంద్రం నుంచి మాత్రమే దేశాభివృద్ధి సాధ్యం కాదని మోదీ నమ్ముతారని, రాష్ట్రాలు, నగరాలకు పెద్ద పాత్ర కల్పించారని చంద్రబాబు పేర్కొన్నారు.

‘వికసిత్‌ భారత్‌’ దిశగా
ప్రపంచ వేదికపై భారత్‌ ప్రభావం పెరిగిందని చంద్రబాబు అన్నారు. జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూనే ఇతర దేశాలతో భాగస్వామ్యాలను బలోపేతం చేస్తోందని తెలిపారు.

భారత్‌కు యువ జనాభా, వ్యాపార స్ఫూర్తి, సాంకేతిక సామర్థ్యం బలాలుగా ఉన్నాయని పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో గత 25 ఏళ్లలో ఏర్పడిన దిశ, సంస్థాగత బలం ‘వికసిత్‌ భారత్‌ 2047’ లక్ష్యాన్ని సాధించేందుకు ఉపయోగపడుతుందని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు.
Advertisement

More Telugu News