ఇంటింటికీ జలధార.. రూ.30,156 కోట్లతో బృహత్ పథకం ప్రారంభించిన చంద్రబాబు, పవన్

ఇంటింటికీ జలధార.. రూ.30,156 కోట్లతో బృహత్ పథకం ప్రారంభించిన చంద్రబాబు, పవన్

Nara Chandrababu Naidu launches 30156 crore Amarajeevi Jaladhara water scheme
  • ప్రొద్దుటూరులో 'అమరజీవి జలధార' పనులకు శ్రీకారం
  • రూ.30,156 కోట్లతో 27 లక్షల కుటుంబాలకు సురక్షిత తాగునీరు
  • రాయలసీమ రైజింగ్‌ను ఎవరూ అడ్డుకోలేరన్న చంద్రబాబు
  • గోదావరి పుష్కరాల లోపు పోలవరం పూర్తి చేస్తామని హామీ
  • గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
  • గొడ్డలి పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారన్న సీఎం
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీటిని అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జల్ జీవన్ మిషన్ 2.0లో భాగంగా రూ.30,156 కోట్ల భారీ వ్యయంతో చేపట్టిన ‘అమరజీవి జలధార’ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోమవారం ప్రారంభించారు. కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని కొత్తపల్లిలో వారు పైలాన్‌ను ఆవిష్కరించి ఈ బృహత్ పథకానికి అంకురార్పణ చేశారు.

ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మరో 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు కొత్తగా కుళాయి కనెక్షన్లు అందించనున్నారు. ఇందుకోసం 13,075 ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం, 77,243 కిలోమీటర్ల పైపులైన్ల విస్తరణ పనులు చేపట్టనున్నారు. ఈ పనులు పూర్తయితే రాష్ట్రంలో మొత్తం 3.3 కోట్ల మందికి సురక్షిత తాగునీరు అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇప్పటికే 62 లక్షల కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు ఉండగా, ఈ కొత్త పథకంతో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది.

రాయలసీమ రైజింగ్.. అభివృద్ధి ఆగదు

ఈ సందర్భంగా ప్రొద్దుటూరులో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. రాయలసీమకు 'రప్పారప్పా' రాజకీయం కాదని, అభివృద్ధి, సంక్షేమం కావాలని స్పష్టం చేశారు. రాయలసీమ అభివృద్ధి బుల్లెట్‌లా దూసుకెళ్తుందని, దానిని ఎవరూ ఆపలేరని అన్నారు. రూ.1 లక్ష కోట్లతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేసి సీమ దశ, దిశ మారుస్తామని ప్రకటించారు. భవిష్యత్తులో శత్రు దేశాలను చీల్చిచెండాడే ఫైటర్ జెట్లు 'మేడ్ ఇన్ రాయలసీమ' అని చెప్పుకునే రోజులు వస్తాయని, ఇక్కడ పండే ఫలాలు 'రాయలసీమ బ్రాండ్'తో ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. రానున్న గోదావరి పుష్కరాల లోపే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రధాని మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని పునరుద్ఘాటించారు.

గొడ్డలి పార్టీపై తీవ్ర విమర్శలు

గత ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 2024 ఎన్నికల్లో ప్రజలు గొడ్డలి పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. వివేకా హత్య కేసు నుంచి మద్యం కుంభకోణం వరకు అన్ని వేళ్లూ ఆ పార్టీ అధినేత వైపే చూపిస్తున్నాయని ఆరోపించారు. కుట్రలు, ఫేక్ ప్రచారమే ఆ పార్టీ సిద్ధాంతమని, వారి డీఎన్ఏలోనే నేరాలు చేసి ఇతరులపై నెట్టేయడం ఉందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష హోదా కోరడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.

కేంద్రం, రాష్ట్రంతో పాటు స్థానిక సంస్థల్లోనూ కూటమి అధికారంలో ఉంటే 'ట్రిపుల్ ఇంజిన్ సర్కార్'తో అభివృద్ధి వేగవంతం అవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎస్.సవిత, పి.నారాయణ, బీసీ జనార్ధన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Nara Chandrababu Naidu
Amarajeevi Jaladhara
Jal Jeevan Mission
Pawan Kalyan
Rayalaseema Development
Drinking Water Project

More Telugu News