కాల్చుకుని చస్తానన్న దర్శన్.. రేణుకాస్వామి హత్య కేసులో వెలుగులోకి అసలు నిజం!
Advertisement

కాల్చుకుని చస్తానన్న దర్శన్.. రేణుకాస్వామి హత్య కేసులో వెలుగులోకి అసలు నిజం!

Darshan said he would shoot himself real truth emerges in Renukaswamy murder case
  • రేణుకాస్వామి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన ప్రదోశ్ కీలక వాంగ్మూలం
  • తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ దర్శన్ బెదిరించాడని వెల్లడి
  • నేరం తమపై వేసుకునేందుకు ఇద్దరికి రూ.10 లక్షలు ఇచ్చినట్లు చెప్పిన ప్రదోశ్ 
  • మృతదేహాన్ని రాజకాలువలో పడేసి, పోలీసులకు కట్టుకథ చెప్పిన నిందితులు
కన్నడనాట సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడిగా ఉండి అప్రూవర్‌గా మారిన ప్రదోశ్ రావు (ఎ-14) కోర్టులో ఇచ్చిన వాంగ్మూలం నటుడు దర్శన్, నటి పవిత్ర గౌడ పాత్రపై సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది. హత్య అనంతరం నేరాన్ని కప్పిపుచ్చేందుకు దర్శన్ చేసిన ప్రయత్నాలను ప్రదోశ్ పూసగుచ్చినట్లు వివరించడంతో కేసు విచారణలో ఉత్కంఠ పెరిగింది.

పవిత్ర గౌడకు అసభ్యకర సందేశాలు పంపాడనే ఆరోపణలతో చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి, 2024 జూన్‌లో బెంగళూరులోని పట్టణగెరె షెడ్డులో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో ప్రదోశ్ తొలుత నిందితుడిగా ఉన్నప్పటికీ, తర్వాత అప్రూవర్‌గా మారారు.

వాంగ్మూలంలోని ముఖ్యాంశాలు
ప్రదోశ్ తన వాంగ్మూలంలో "దాడి అనంతరం దర్శన్, పవిత్ర ఇంటికి వెళ్లిపోయారు. కొంత సమయానికి రేణుకాస్వామి చనిపోయాడని తెలియగానే సహ నిందితులు దర్శన్ ఇంటికి వెళ్లారు. విషయం తెలిసి తీవ్ర భయాందోళనకు గురైన దర్శన్.. ‘నేను రివాల్వర్‌తో కాల్చుకుని చనిపోతాను’ అని బెదిరించాడు. నేరాన్ని ఎవరైనా తమపై వేసుకోకపోతే తనకు ఉరి వేసుకోవడం తప్ప మరో మార్గం లేదని ఆందోళన చెందాడు" అని పేర్కొన్నాడు.

వెంటనే నేరాన్ని తమపై వేసుకుని లొంగిపోయే వారికి పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వడానికి దర్శన్ సిద్ధమయ్యాడని ప్రదోశ్ వివరించాడు. ఇద్దరు యువకులు (కార్తిక్, నిఖిల్) ఇందుకు అంగీకరించడంతో, వారికి చెరో రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.10 లక్షల బయానాను దర్శన్ తన ఇంట్లోని సంచిలో పెట్టి ఇచ్చాడని తెలిపాడు. రేణుకాస్వామిని అపహరించిన రాఘవేంద్రకు అదనంగా మరో రూ.5 లక్షలు ఇచ్చినట్లు చెప్పాడు.

అనంతరం మృతదేహాన్ని పారవేసేందుకు నిందితులు కెంగేరి, నాగరబావి వంటి పలు ప్రాంతాల్లో తిరిగి, చివరకు కామాక్షిపాళ్య సమీపంలోని మాళగాళ రాజకాలువలో పడేశారని ప్రదోశ్ వాంగ్మూలంలో పేర్కొన్నాడు. పోలీసుల ఎదుట లొంగిపోయే యువకులు ఏం చెప్పాలో కూడా ముందే ఒక కట్టుకథను సిద్ధం చేశారని, డబ్బుల విషయంలో గొడవ జరిగి కొట్టడంతో రేణుకాస్వామి చనిపోయాడని చెప్పినట్లు వివరించాడు.

సెప్టెంబర్ చివరి వారంలో బెంగళూరులోని 59వ సీసీహెచ్ కోర్టులో ఇన్-కెమెరా పద్ధతిలో ప్రదోశ్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. దర్శన్, పవిత్రతో సహా ఇతర నిందితులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ప్రదోశ్ వాంగ్మూలం ప్రాసిక్యూషన్‌కు అత్యంత కీలకంగా మారనుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఈ కేసు విచారణ కొనసాగుతోంది.
Advertisement
Darshan
Renukaswamy murder case
Pavithra Gowda
Pradosh Rao
Bengaluru police investigation
Kannada actor Darshan

More Telugu News