బ్యాంకులకు ప్రతి శనివారం సెలవా? వైరల్ గెజిట్‌పై కేంద్రం క్లారిటీ

బ్యాంకులకు ప్రతి శనివారం సెలవా? వైరల్ గెజిట్‌పై కేంద్రం క్లారిటీ

Bank Holidays Every Saturday Viral Gazette Central Government Clarity
  • ప్రతి శనివారం బ్యాంకులకు సెలవంటూ వైరల్ గెజిట్
  • అది నకిలీదని వెల్లడించిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్
  • ఆర్థిక శాఖ ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని స్పష్టీకరణ
  • రెండు, నాలుగో శనివారాలు మాత్రమే సాధారణ సెలవులు
  • సమాచారాన్ని అధికారిక వర్గాల నుంచి నిర్ధారించుకోవాలని పీఐబీ సూచన
ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రతి శనివారం సెలవు ప్రకటించారంటూ సోషల్ మీడియాలో గెజిట్‌ నోటిఫికేషన్‌ వైరలవుతోంది. అయితే అది నకిలీదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. ఇలాంటి నోటిఫికేషన్‌ను ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సేవల విభాగం జారీ చేయలేదని తెలిపింది.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్‌’లో పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఎస్‌బీఐ సహా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్రం ప్రతి శనివారం సెలవు ప్రకటించిందని ఆ నకిలీ గెజిట్‌లో ఉంది. 

ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రతి నెలా రెండు, నాలుగో శనివారాలు మాత్రమే సెలవులు ఉన్నాయి. మిగిలిన శనివారాల్లో బ్యాంకులు సాధారణంగా పనిచేస్తాయి. 2015లో రెండు, నాలుగో శనివారాలను ప్రభుత్వ రంగ బ్యాంకులకు సెలవులుగా ప్రకటించారు.

వైరల్ అవుతున్న పత్రాలను చూసి వెంటనే నమ్మవద్దని పీఐబీ ప్రజలను కోరింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం విషయంలో అధికారిక వర్గాల ద్వారా వివరాలు నిర్ధారించుకున్న తర్వాతే షేర్ చేయాలని సూచించింది. అనుమానాస్పద సమాచారాన్ని పీఐబీ ఫ్యాక్ట్ చెక్‌కు పంపించాలని తెలిపింది.

బ్యాంకులకు ఐదు రోజుల పని వారాన్ని అమలు చేయాలన్న డిమాండ్ నేపథ్యంలో బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఇటీవల సమ్మెకు పిలుపునిచ్చాయి. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం బ్యాంకింగ్ సేవలకు అంతరాయం తగ్గించేందుకు సెప్టెంబర్ 27న ఆదివారం కూడా ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు పనిచేసేలా చర్యలు తీసుకుంది. ఆ తర్వాత చర్చలు ఫలప్రదం కావడంతో బ్యాంకులు సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాయి.  
Advertisement
Bank Holidays
PIB Fact Check
Fake Gazette Notification
Public Sector Banks
Five Day Bank Week
Central Government Clarity

More Telugu News