ఆన్‌లైన్‌ పార్సిల్‌ బాక్సులు ఎక్కువగా బ్రౌన్‌ రంగులోనే ఎందుకుంటాయి?

ఆన్‌లైన్‌ పార్సిల్‌ బాక్సులు ఎక్కువగా బ్రౌన్‌ రంగులోనే ఎందుకుంటాయి?

Online Parcel Boxes Why are they mostly brown in color
  • బాక్స్‌ తయారయ్యే పదార్థం, ఖర్చు, మన్నికే ప్రధాన కారణం
  • క్రాఫ్ట్‌ పేపర్‌, కరుగేటెడ్‌ ఫైబర్‌బోర్డుతో పార్సిల్‌ బాక్సుల తయారీ
  • తయారీ ప్రక్రియలోనే దానికి సహజంగా గోధుమ రంగు
  • ప్రత్యేకంగా రంగు వేయాల్సిన అవసరం లేకుండా అదే కలర్‌ కొనసాగింపు
  • రుగేటెడ్‌ బాక్సుల్లో పలు పొరలు వల్ల మన్నిక మరో ప్రయోజనం
ఆన్‌లైన్‌లో ఏదైనా ఆర్డర్‌ చేశారంటే.. కొన్ని రోజుల్లో మన ఇంటి తలుపు దగ్గరకు ఓ బ్రౌన్‌ రంగు బాక్స్‌ వచ్చేస్తుంది. అందులో పుస్తకాలు ఉండొచ్చు.. బట్టలు ఉండొచ్చు.. ఇంట్లో వాడే వస్తువులు ఉండొచ్చు. వస్తువు ఏదైనా ప్యాకింగ్‌ మాత్రం చాలాసార్లు ఒకేలా కనిపిస్తుంది. అసలు ఈ బాక్సులన్నీ బ్రౌన్‌ రంగులోనే ఎందుకుంటాయి? తెలుపు, ఎరుపు, నీలం లాంటి రంగుల్లో ఎందుకు ఉండవు? దీని వెనుక పెద్ద రహస్యం ఏమీ లేదు. బాక్స్‌ తయారయ్యే పదార్థం, ఖర్చు, మన్నిక.. ఇవే ప్రధాన కారణాలు.

ప్రత్యేకంగా రంగు వేయాల్సిన అవసరం ఉండదు
చాలా షిప్పింగ్‌ బాక్సులను క్రాఫ్ట్‌ పేపర్‌, కరుగేటెడ్‌ ఫైబర్‌బోర్డుతో తయారు చేస్తారు. వీటికి సహజంగానే లేత గోధుమ లేదా బ్రౌన్‌ రంగు ఉంటుంది. క్రాఫ్ట్‌ పేపర్‌ను కలప నుంచి లభించే ఫైబర్లతో తయారు చేస్తారు. తయారీ ప్రక్రియలోనే దానికి ఈ సహజ రంగు వస్తుంది. అంటే సాధారణ పార్సిల్‌ బాక్స్‌ బ్రౌన్‌గా కనిపించడానికి ప్రత్యేకంగా బ్రౌన్‌ రంగు పూయాల్సిన అవసరం ఉండదు.

ఖర్చు తగ్గుతుంది
బ్రౌన్‌ బాక్సులు ఎక్కువగా వాడటానికి మరో ముఖ్య కారణం ఖర్చు. తెలుపు లేదా ఇతర రంగుల్లో బాక్సులను తయారు చేయాలంటే అదనపు కోటింగ్‌, ప్రాసెసింగ్‌, ప్రింటింగ్‌ అవసరం కావచ్చు. సాధారణ క్రాఫ్ట్‌ ప్యాకేజింగ్‌ను మాత్రం పెద్దగా అదనపు ఫినిషింగ్‌ లేకుండానే ఉపయోగించవచ్చు.

రోజుకు లక్షల పార్సిళ్లు పంపించే ఈ-కామర్స్‌ సంస్థలకు ఒక్కో బాక్స్‌పై కొద్దిగా అదనపు ఖర్చు వచ్చినా.. మొత్తం మీద అది భారీ మొత్తంగా మారుతుంది. అందుకే తక్కువ ఖర్చుతో లభించే సాధారణ క్రాఫ్ట్‌ ప్యాకేజింగ్‌ వారికి ఉపయోగకరంగా ఉంటుంది.

బలం కూడా ఎక్కువే
బ్రౌన్‌ బాక్సులకు కేవలం తక్కువ ధర మాత్రమే కారణం కాదు. ఇవి బలంగా ఉండటం కూడా మరో ముఖ్య కారణం. కరుగేటెడ్‌ బాక్సుల్లో పలు పొరలు ఉంటాయి. మధ్యలో ఉండే అలల మాదిరి పొర బాక్స్‌కు గట్టిదనాన్ని ఇస్తుంది. వస్తువులను తరలించే సమయంలో ఒత్తిడి, చిన్నపాటి దెబ్బల నుంచి రక్షించడంలో ఇది సహాయపడుతుంది.
Advertisement
Online Parcel Boxes
E-commerce Shipping
Kraft Paper
Delivery Packaging
Corrugated Fiberboard
Packaging Industry

More Telugu News