కెప్టెన్ స్మిత్ ధైర్యానికి సెల్యూట్.. ఆకాశంలో అసలైన హీరో: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

కెప్టెన్ స్మిత్ ధైర్యానికి సెల్యూట్.. ఆకాశంలో అసలైన హీరో: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

Captain Smith Macher real hero in the sky says Pawan Kalyan
  • విమానంలో సహ పైలట్ దాడిని ఎదుర్కొన్న కెప్టెన్ స్మిత్
  • క్షతగాత్రుడైనా 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన వైనం
  • స్మిత్‌ను ఆకాశంలో రియల్ హీరోగా అభివర్ణించిన పవన్ కళ్యాణ్
  • కెప్టెన్ ధైర్యాన్ని కొనియాడిన మాజీ సీఎం జగన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  • రాజకీయాలకు అతీతంగా స్మిత్‌పై వెల్లువెత్తిన ప్రశంసలు
ఆకాశంలో అసలైన హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత‌, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశంసించారు. ఫ్లైదుబాయ్ విమానంలో సహ పైలట్ దాడిని ఎదుర్కొని, 174 మంది ప్రాణాలను కాపాడిన ఆయన ధైర్యాన్ని ఇరువురు నేతలు కొనియాడారు. రాజకీయాలకు అతీతంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం స్మిత్ సాహసాన్ని అభినందించారు.

అసలేం జరిగిందంటే..!
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానం FZ1073 గాల్లో ఉండగా ఈ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. విమానం కాక్‌పిట్‌లో ఉన్న కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై, ఆయన సహ పైలట్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. విమానాన్ని తన నియంత్రణలోకి తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడినప్పటికీ, కెప్టెన్ స్మిత్ అసాధారణ ధైర్యం ప్రదర్శించారు. 

దుండగుడితో పోరాడి, కాక్‌పిట్ డోర్‌ను తెరవగలిగారు. దీంతో వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది, ప్రయాణికులు కలిసి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కెప్టెన్ స్మిత్ సమయస్ఫూర్తి వల్ల పెను ప్రమాదం తప్పి, విమానంలోని 174 మంది సురక్షితంగా బయటపడ్డారు.

పవన్ కల్యాణ్ ప్రశంసలు
ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కార్యాలయం 'ఎక్స్' వేదికగా స్పందించింది. "విమానంలో సంక్షోభ సమయంలో కెప్టెన్ స్మిత్ మచ్చర్ చూపిన అసాధారణ ధైర్యానికి, సమయస్ఫూర్తికి హృదయపూర్వక అభినందనలు. తీవ్రంగా గాయపడినా, దాడిని ఎదుర్కొని కాక్‌పిట్ డోర్ తెరిచి, పెను విషాదాన్ని నివారించారు. 

ప్రతి సెకను కీలకమైన సమయంలో, 174 మంది ప్రాణాలకు, ప్రమాదానికి మధ్య ఆయన నిలిచారు. ఆయన అసలైన హీరో, గర్వించదగ్గ భారతీయుడు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అని జనసేన నేత పవన్ కల్యాణ్ తన పోస్టులో పేర్కొన్నారు.

కొనియాడిన జగన్, కిషన్ రెడ్డి
వైసీపీ అధినేత‌, మాజీ సీఎం వైఎస్ జగన్ సైతం కెప్టెన్ స్మిత్ ధైర్యాన్ని కొనియాడారు. "ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలను కాపాడటంలో స్మిత్ మచ్చర్ చూపిన అసామాన్య ధైర్యానికి హ్యాట్సాఫ్. తీవ్రంగా గాయపడినా ప్రయాణికుల భద్రత పట్ల తన నిబద్ధతను వీడలేదు. ధైర్యం, నిస్వార్థ సేవకు ప్రపంచానికి అర్థం చూపిన గర్వించదగ్గ భారతీయుడు. ఆయన త్వరగా కోలుకోవాలి" అని జగన్ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి కూడా కెప్టెన్ స్మిత్‌పై ప్రశంసలు కురిపించారు. "తీవ్రమైన ప్రమాదం ఎదురైనప్పటికీ కెప్టెన్ స్మిత్ అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించారు. ఆయన మొక్కవోని సంకల్పం, నిస్వార్థ నిబద్ధత వందలాది మంది ప్రాణాలను కాపాడాయి. స్మిత్‌ను చూసి భారతదేశం గర్విస్తోంది. ఆయన త్వరగా కోలుకోవాలి" అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా నేతలంతా ఓ హీరోను అభినందించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Advertisement
Captain Smith Macher
Pawan Kalyan
Flydubai flight attack
YS Jagan Mohan Reddy
Aviation hero
G Kishan Reddy

More Telugu News