అమెరికాకు 100 ఏళ్లు పట్టింది, భారత్‌కు 20 ఏళ్లు చాలు: సీఎం చంద్రబాబు
Advertisement

అమెరికాకు 100 ఏళ్లు పట్టింది, భారత్‌కు 20 ఏళ్లు చాలు: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu says US took 100 years but India needs only 20 years to develop
  • విజయవాడలో జరిగిన మిషన్ కర్మయోగి వర్క్‌షాప్
  • ఉద్యోగుల సామర్థ్య పెంపులో ఏపీకి జాతీయ స్థాయిలో తొలి ర్యాంక్
  • విజేతలకు అవార్డులు అందజేసి ప్రసంగించిన సీఎం చంద్రబాబు
  • సాంకేతికత, నైపుణ్యాలతోనే దేశాభివృద్ధి సాధ్యమన్న సీఎం
  • రెండో స్థానంలో కర్ణాటక, మూడో స్థానంలో ఒడిశా
అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి అమెరికాకు వందేళ్లు పడితే, ఆసియా దేశాలకు ఆరు నుంచి ఏడు దశాబ్దాలు పడితే, చైనాకు 45 ఏళ్లు పట్టిందని, కానీ నేటి భారత్‌కు ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి 20 ఏళ్లు చాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. సరైన నాయకత్వం, సాంకేతికత, అపారమైన యువశక్తితో ఈ అద్భుతాన్ని సాధించగల సత్తా భారత్‌కు ఉందని ఆయన స్పష్టం చేశారు. విజయవాడలోని అంబేడ్కర్ కళావేదికలో మంగళవారం జరిగిన 'మిషన్ కర్మయోగి' వర్క్‌షాప్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఒడిశా, పుదుచ్చేరి రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంచడంలో (కెపాసిటీ బిల్డింగ్) దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచినందుకు గాను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, ఏపీఎస్‌డీపీఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అలపర్తి వెంకటేశ్వరరావులకు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవార్డును ప్రదానం చేశారు. ఇదే విభాగంలో ద్వితీయ స్థానంలో నిలిచిన కర్ణాటక, తృతీయ స్థానంలో నిలిచిన ఒడిశా రాష్ట్రాల ప్రతినిధులకు కూడా ఆయన అవార్డులు అందజేశారు.

భవిష్యత్తు మనదే.. మార్పు అనివార్యం
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, "భారత్ ఇప్పుడు ఒక నిర్ణయాత్మకమైన దశలో ఉంది. మనకు జ్ఞానం, సాంకేతికత, అపారమైన అవకాశాలు ఉన్నాయి. మన యువతలో అసాధారణమైన ఆకాంక్షలు ఉన్నాయి. ఈ ఆకాంక్షలను నెరవేర్చేందుకు మన పరిపాలనా వ్యవస్థలు సిద్ధంగా ఉన్నాయా? అన్నదే అసలైన ప్రశ్న. రాబోయే 20 ఏళ్లు దేశ భవిష్యత్తుకు అత్యంత కీలకం" అని విశ్లేషించారు. 

తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో మార్పులు చూశానని, ఒకప్పుడు కరెంట్, రోడ్లు, కనీసం ట్యాప్ వాటర్ కూడా లేని గ్రామం నుంచి తాను వచ్చానని గుర్తుచేసుకున్నారు. పదుల గ్రామాలకు కలిపి ఒకే ఒక్క టెలిఫోన్ ఉండేదని, అది కూడా పనిచేసేది కాదని నాటి పరిస్థితులను వివరించారు.

సాంకేతికతతో సుపరిపాలన
అలాంటి రోజుల నుంచి నేడు డిజిటల్ ఇండియా వరకు దేశం ఎంతో మారిందన్నారు. "గతంలో ఒక ఫైల్ ముందుకు కదలాలంటే ఎల్‌డీసీ నుంచి అదనపు కార్యదర్శి వరకు 15 నుంచి 20 స్థాయిలు దాటాల్సి వచ్చేది. కొన్నిసార్లు ఫైళ్లు కనపడక రోజుల తరబడి వెతకాల్సి వచ్చేది. కానీ ఈ-ఆఫీస్ విధానంతో ఇప్పుడు నిమిషాల్లో ఫైళ్లను క్లియర్ చేయగలుగుతున్నాం. నేను కూడా రోజుకు 15-20 నిమిషాల్లో ఫైళ్లను పూర్తి చేస్తున్నా" అని తెలిపారు. 

సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో అంగన్‌వాడీ టీచర్ కూడా తనకంటే మెరుగ్గా ఉన్నారని ప్రశంసించారు. రియల్ టైం గవర్నెన్స్, డేటా లేక్, కృత్రిమ మేధ (AI), డ్రోన్లు, సెన్సార్ల వాడకంతో పాలనను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ సేవలను చేరవేయడమే లక్ష్యమని వివరించారు.

పిల్లి నల్లదా తెల్లదా అనేది ముఖ్యం కాదు.. ఎలుకను పట్టడమే ముఖ్యం!
ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన 'మిషన్ కర్మయోగి' ఒక అద్భుతమైన సంస్కరణ అని చంద్రబాబు కొనియాడారు. ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంచేందుకు ఇది ఎంతగానో దోహదపడుతోందన్నారు. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఒక సెకండరీ గ్రేడ్ టీచర్ 4,200 కోర్సులు పూర్తి చేసి, జాతీయ స్థాయిలో 14,500 క్రెడిట్లు సాధించడం దీని విజయానికి నిదర్శనమన్నారు. 

చైనా ఆర్థిక సంస్కరణలను ప్రస్తావిస్తూ, "పిల్లి నల్లదా, తెల్లదా అన్నది ముఖ్యం కాదు, అది ఎలుకలను పడుతుందా లేదా అన్నదే ముఖ్యం" అనే డెంగ్ షియావోపింగ్ సూక్తిని గుర్తుచేశారు. ఫలితాలు రాబట్టడమే మన అంతిమ లక్ష్యం కావాలన్నారు.

స్వర్ణాంధ్ర ప్రదేశ్ లక్ష్యం
ఆంధ్రప్రదేశ్‌ను 'స్వర్ణాంధ్ర ప్రదేశ్ 2047'గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చంద్రబాబు పునరుద్ఘాటించారు. రాష్ట్ర జీఎస్‌డీపీ వృద్ధి రేటును 15 శాతానికి పైగా సాధించే సత్తా ఏపీకి ఉందన్నారు. 

"ఆంధ్రప్రదేశ్‌ను మిగతా రాష్ట్రాలకు ఒక పరిశోధన, అభివృద్ధి కేంద్రంగా (R&D Center), ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్‌గా నిలబెడతాం. ఇక్కడ విజయవంతమైన నమూనాలను ఇతర రాష్ట్రాలు అనుసరించేలా చేస్తాం" అని ప్రకటించారు. 

సంక్షేమం, అభివృద్ధిని జోడించి సంపద సృష్టించి, ఆ ఫలాలను నిరుపేదలకు అందించడం ద్వారా అసమానతలను తగ్గించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలోని నదుల అనుసంధానం పూర్తయితే భారత్‌ను ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు. అంతిమంగా మనమంతా భారతీయులమని, పార్టీలు, ప్రాంతాలు వేరైనా దేశాన్ని ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలపాలన్నదే అందరి లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు.
Advertisement
Chandrababu Naidu
Mission Karmayogi
Swarnandhra Pradesh 2047
India Developed Nation
Andhra Pradesh Governance
Digital India Technology

More Telugu News