పెర్ఫ్యూమ్‌ కంటే ఫెరోమోన్స్‌ ఎక్కువ ఆకర్షిస్తుందా? అసలు కథ ఇదే!
Advertisement

పెర్ఫ్యూమ్‌ కంటే ఫెరోమోన్స్‌ ఎక్కువ ఆకర్షిస్తుందా? అసలు కథ ఇదే!

Do pheromones attract more than perfumes here is the real story
  • ఫెరోమోన్స్‌ అంటే ప్రత్యేక రసాయన సంకేతాలు
  • జంతువుల్లో వీటి పాత్ర చాలా కీలకం
  • మనుషుల్లో ఫెరోమోన్స్ ప్రభావంపై లేని బలమైన ఆధారాలు
  • శరీర సహజ వాసన ఆకర్షణను ప్రభావితం చేయొచ్చంటున్న పరిశోధనలు
  • నిరూపితం కాని ‘ఫెరోమోన్‌ పెర్ఫ్యూమ్‌’ ప్రభావం
ఎదుటివాళ్లను ఆకట్టుకోవాలంటే మంచి పెర్ఫ్యూమ్‌ వేసుకోవాలని చాలా మంది అనుకుంటారు. కానీ ఇప్పుడు సోషల్‌ మీడియాలో మరో మాట బాగా వినిపిస్తోంది.. పెర్ఫ్యూమ్‌ కంటే మన శరీర సహజ వాసనే ఎక్కువగా ఆకర్షిస్తుందట! దీనినే ఫెరోమోన్స్‌తో ముడిపెట్టి ‘ఫెరోమోన్‌-మ్యాక్సింగ్‌’ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇటీవల నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ ఓ ఇంటర్వ్యూలో పెర్ఫ్యూమ్‌ కంటే ఫెరోమోన్స్‌నే ఎంచుకుంటానని చెప్పడంతో ఈ విషయం మరోసారి చర్చలోకి వచ్చింది. ఇంతకీ ఈ ఫెరోమోన్స్‌ నిజంగా మనుషుల ఆకర్షణను ప్రభావితం చేస్తాయా?

జంతువుల్లో కీలకం
ఫెరోమోన్స్‌ గురించి మాట్లాడితే ముందుగా జంతువుల ప్రపంచం గుర్తుకొస్తుంది. చాలా జంతువులు తమ జాతిలోని ఇతర జీవులకు సంకేతాలు పంపేందుకు ప్రత్యేక రసాయనాలను విడుదల చేస్తాయి. పార్ట్‌నర్‌ను ఆకర్షించడం, తమ ప్రాంతాన్ని గుర్తించడం వంటి విషయాల్లో ఇవి కీలకంగా పనిచేస్తాయి. అందుకే మనుషుల్లో కూడా ఇలాంటి రసాయన సంకేతాలు ఉండొచ్చనే ఆసక్తి మొదలైంది.

మనుషుల్లో మాత్రం..
ఇక్కడే అసలు ట్విస్ట్‌ ఉంది. జంతువుల్లో ఫెరోమోన్స్‌ పనిచేస్తాయని ఆధారాలు ఉన్నప్పటికీ, మనుషుల్లో ఒక నిర్దిష్ట రసాయనం ఇతరులను ఆకర్షిస్తుందని నిరూపించే బలమైన ఆధారాలు ఇప్పటివరకు లేవు. కొన్ని పరిశోధనలు మన శరీర వాసన, ఆకర్షణ మధ్య సంబంధం ఉండొచ్చని సూచించాయి. కానీ దాన్ని నేరుగా ‘ఫెరోమోన్‌ ప్రభావం’ అని చెప్పడం మాత్రం అంత సులభం కాదు.

చెమట వాసనపై పరిశోధనలు
మన శరీర సహజ వాసనపై జరిగిన కొన్ని ప్రయోగాలు మాత్రం ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టాయి. ఒకరి చెమట వాసనను మరొకరు గుర్తించడం, వ్యక్తుల మధ్య ఆకర్షణలో శరీర వాసనకు కొంత పాత్ర ఉండొచ్చనే అంశాలపై పరిశోధనలు జరిగాయి. ముఖ్యంగా రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన ఎంహెచ్‌సీ జన్యువులు, శరీర వాసన మధ్య సంబంధంపై కూడా అధ్యయనాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కలిపి చూసినా.. “ఈ వాసన వల్ల ఎదుటివాళ్లు కచ్చితంగా ఆకర్షితులవుతారు” అనే స్థాయిలో శాస్త్రీయ ఆధారం లేదు.

మరి ‘ఫెరోమోన్‌ పెర్ఫ్యూమ్‌’ మాటేంటి?
ఫెరోమోన్స్‌ పేరుతో మార్కెట్‌లో దొరికే పెర్ఫ్యూమ్‌లు, ఉత్పత్తులు ఈ ఆసక్తినే క్యాష్‌ చేసుకుంటున్నాయి. వాటిని వాడితే ఆకర్షణ పెరుగుతుందని ప్రచారం జరుగుతున్నా, మనుషుల్లో ఫెరోమోన్స్‌ ప్రభావం ఇంకా శాస్త్రీయంగా స్పష్టంగా నిరూపితం కాలేదు. అంటే సహజ శరీర వాసనకు ఎలాంటి ప్రాధాన్యం లేదని కాదు.. కానీ దానిని ఒక ‘ఆకర్షణ ఫార్ములా’గా చెప్పడానికి మాత్రం ప్రస్తుతం ఉన్న ఆధారాలు సరిపోవు.
Advertisement
Pheromones
Ranbir Kapoor
Pheromone Maxxing
Human Attraction
Body Odor
Perfume Trends

More Telugu News