మైనర్ భార్యతో శృంగారం నేరమే: ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

మైనర్ భార్యతో శృంగారం నేరమే: ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

Delhi High Court rules sex with minor wife is a crime in landmark verdict
  • ముస్లిం పర్సనల్ లా ప్రకారం మైనర్‌ను పెళ్లి చేసుకున్నా, శృంగారం నేరమేనన్న ఢిల్లీ హైకోర్టు
  • 16 ఏళ్ల బాలికను పెళ్లాడిన భర్తపై పోక్సో కేసును కొట్టివేయడానికి నిరాకరణ
  • క్రిమినల్ చట్టాలైన పోక్సో, బీఎన్‌ఎస్‌లకు వ్యక్తిగత చట్టాలు మినహాయింపు కాదని స్పష్టీకరణ
  • లైంగిక సంబంధానికి సమ్మతి తెలిపే వయసు 18 ఏళ్లేనని, వివాహంతో అది మారదని తీర్పు
ముస్లిం పర్సనల్ లా ప్రకారం 18 ఏళ్లలోపు బాలికను వివాహం చేసుకోవడం చెల్లుబాటు అయినా, ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోవడం పోక్సో, భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) కింద తీవ్రమైన నేరమేనని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. వ్యక్తిగత చట్టాలు కేవలం వివాహం వంటి సివిల్ వ్యవహారాలకే పరిమితమని, మైనర్‌పై లైంగిక దాడికి అవి రక్షణ కల్పించలేవని తేల్చిచెప్పింది.

16 ఏళ్ల 3 నెలల వయసున్న బాలికను 28 ఏళ్ల యువకుడు ఇరు కుటుంబాల అంగీకారంతో ముస్లిం సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నాడు. బాలిక 8 నెలల గర్భిణిగా ఉన్నప్పుడు చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా, ఆమె మైనర్ అని గుర్తించిన అధికారులు భర్తపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ దంపతులిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌ను సెప్టెంబరు 23న విచారించిన జస్టిస్ సంజీవ్ నారుల దానిని కొట్టివేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. "వివాహం జరిగినంత మాత్రాన బాలిక వయసు పెరగదు. చట్టప్రకారం లైంగిక చర్యకు సమ్మతి తెలిపే వయసు 18 ఏళ్లు. పర్సనల్ లా ప్రకారం యుక్తవయసు (ప్యూబర్టీ) రావడం అనేది దీనికి ప్రత్యామ్నాయం కాదు" అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. వివాహ బంధంలో ఉన్నప్పటికీ, భార్య వయసు 18 ఏళ్ల లోపు ఉంటే లైంగిక సంబంధం బీఎన్ఎస్ ప్రకారం కూడా నేరమేనని గుర్తుచేశారు.

మైనర్ సమ్మతికి చట్టపరంగా ఎలాంటి విలువ ఉండదని కోర్టు పునరుద్ఘాటించింది. పిల్లల రక్షణ కోసం పార్లమెంటు రూపొందించిన పోక్సో, బీఎన్ఎస్ వంటి కఠిన చట్టాలను వ్యక్తిగత చట్టాల పేరుతో బలహీనపరచలేమని తీర్పులో పేర్కొంది.  
Advertisement
Delhi High Court
POCSO Act
Minor Wife Case
Muslim Personal Law
Justice Sanjeev Narula
Bharatiya Nyaya Sanhita

More Telugu News