సీఎం విజయ్ నటనను ఇంకా ఆపలేదు: స్టాలిన్

సీఎం విజయ్ నటనను ఇంకా ఆపలేదు: స్టాలిన్

CM Vijay has not stopped acting yet says Stalin
  • సీఎం విజయ్‌పై మాజీ సీఎం స్టాలిన్ తీవ్ర విమర్శలు
  • ప్రజల ముందు విజయ్ నటన ఇంకా కొనసాగుతోందని ఎద్దేవా
  • డీఎంకే పథకాలకే పేర్లు మార్చి అమలు చేస్తున్నారని ఆరోపణ
  • సీఎం పదవికి తగిన హుందాతనం చూపాలని హితవు
తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్‌పై మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కే. స్టాలిన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సినిమాలకు స్వస్తి పలికినప్పటికీ, ప్రజల ముందు విజయ్ ఇంకా నటిస్తూనే ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఈ మేరకు శనివారం 'ఎక్స్' వేదికగా ఆయన ఒక పోస్ట్ చేశారు.

మధురాంతకం అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో విజయ్ నటనను తాను ప్రత్యక్షంగా చూశానని స్టాలిన్ పేర్కొన్నారు. డీఎంకేను ఒక దుష్టశక్తిగా, టీవీకేను పవిత్ర శక్తిగా విజయ్ అభివర్ణించడం హాస్యాస్పదమని విమర్శించారు. విజయ్ ప్రభుత్వ హయాంలో పరిపాలన పూర్తిగా విఫలమైందని, రాష్ట్రంలో విద్యుత్ కోతలు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, పాల కొరత, శాంతిభద్రతల క్షీణత వంటి సమస్యలు పెరిగిపోయాయని ఆరోపించారు. గత డీఎంకే ప్రభుత్వ పథకాలకే పేర్లు మార్చి టీవీకే ప్రభుత్వం అమలు చేస్తోందని ఆయన మండిపడ్డారు.

జెమ్ గ్రానైట్స్ ఛైర్మన్ ఆర్. వీరమణికి సంబంధించిన పోక్సో కేసులో డీఎంకేపై విజయ్ చేస్తున్న ఆరోపణలు కేవలం నిరాధారమని స్టాలిన్ కొట్టిపారేశారు. ఈ విషయంపై తాను ఇప్పటికే అసెంబ్లీలో స్పష్టమైన వివరణ ఇచ్చానని గుర్తుచేశారు. దర్యాప్తు దశలో ఉన్న అంశాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని మద్రాస్ హైకోర్టు ఆదేశించినప్పటికీ, ఎన్నికల ప్రచారంలో విజయ్ పదేపదే ఈ అంశాన్ని ప్రస్తావించడం సరికాదన్నారు. ఇప్పటికైనా ప్రజల ముందు నటించడం మాని, ముఖ్యమంత్రి పదవికి ఉండాల్సిన రాజకీయ హుందాతనాన్ని ప్రదర్శించాలని విజయ్‌కు స్టాలిన్ హితవు పలికారు.
Advertisement
Vijay
MK Stalin
TVK party
DMK
Tamil Nadu politics
Vijay vs Stalin

More Telugu News