ఈ చాన్స్ వదులుకోవద్దు.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి నారా లోకేశ్ పిలుపు

ఈ చాన్స్ వదులుకోవద్దు.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి నారా లోకేశ్ పిలుపు

Nara Lokesh urges pharma giants not to miss investment opportunities in Andhra Pradesh
  • అహ్మదాబాద్‌లో ఫార్మా రంగ ప్రతినిధులతో మంత్రి లోకేశ్ సమావేశం
  • నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్కులో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం
  • క్లస్టర్ మోడల్‌లో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి
  • స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తమ ప్రభుత్వ ప్రత్యేకత అని స్పష్టం
  • సమావేశంలో పాల్గొన్న పలు ప్రముఖ ఫార్మా కంపెనీల అధినేతలు
ఆంధ్రప్రదేశ్‌ను ఫార్మాస్యూటికల్ రంగంలో కీలక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా, పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ అహ్మదాబాద్‌లో పర్యటించారు. సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ 2026లో భాగంగా, ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఈడీబీ) ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఫార్మా రంగంపై రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా, ఫార్మా రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను ఆయన ఆహ్వానించారు.

"స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మా ప్రభుత్వ ప్రత్యేకత" అని మంత్రి స్పష్టం చేశారు. 2030 నాటికి భారత ఫార్మా మార్కెట్ 130 బిలియన్ డాలర్లకు చేరనుండగా, ఈ అభివృద్ధిలో ఏపీ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. ప్రస్తుతం దేశంలోనే మూడో అతిపెద్ద ఔషధ ఎగుమతిదారుగా రాష్ట్రం నిలిచిందని లోకేశ్ వివరించారు. 11.05 బిలియన్ డాలర్ల విలువతో భారత ఫార్మా రంగంలో టాప్-5 రాష్ట్రాల్లో ఏపీ ఒకటిగా ఉందని గణాంకాలతో సహా తెలిపారు.

అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ప్రభుత్వం 2,000 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న బల్క్ డ్రగ్ పార్క్ గురించి మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. "విస్తారమైన భూమి, పోర్టుకు సమీపంగా ఉండటం, తక్కువ నిర్వహణ వ్యయాలు, బలమైన ఫార్మా ఎకోసిస్టమ్‌తో పాటు ప్రభుత్వ ప్రోత్సాహకాలు, రాయితీలు కల్పిస్తున్నాం. మొదటి దశ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ అవకాశాన్ని వదులుకోవద్దు.. సద్వినియోగం చేసుకోవాలి" అని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.

నక్కపల్లితో పాటు అనకాపల్లి, విశాఖపట్నం, శ్రీకాకుళం, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో క్లస్టర్ మోడల్‌లో పారిశ్రామిక అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. విశాఖపట్నంలోని మెడికల్ టెక్నాలజీ పార్క్ (ఏఎంటీజడ్), రాష్ట్రంలోని 6 ఆపరేషనల్ పోర్టులు, రాబోయే 4 గ్రీన్‌ఫీల్డ్ పోర్టులు ఫార్మా రంగానికి మరింత ఊతమిస్తాయని ఆయన పేర్కొన్నారు.

ఈ కీలక సమావేశంలో ఇండియన్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐడీఎంఏ) జాతీయ అధ్యక్షుడు విరంచి షా, జైడస్ గ్రూప్, క్యాడిలా ఫార్మాస్యూటికల్స్, ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ వంటి ప్రముఖ సంస్థల ఛైర్మన్లు, ప్రతినిధులు పాల్గొన్నారు. వీరితో పాటు స్వర్ణిమ్ స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ యూనివర్సిటీ ప్రతినిధులు, సీఎస్ఐఆర్ శాస్త్రవేత్తలు కూడా హాజరయ్యారు.
Advertisement
Nara Lokesh
Andhra Pradesh Pharma Sector
Bulk Drug Park Nakkapalli
Pharma Investment AP
CII Partnership Summit 2026
Speed of Doing Business

More Telugu News