ఒమన్‌ నుంచి చిత్తూరు మహిళ కన్నీటి వేడుకోలు.. స్పందించిన మంత్రి నారా లోకేశ్

ఒమన్‌ నుంచి చిత్తూరు మహిళ కన్నీటి వేడుకోలు.. స్పందించిన మంత్రి నారా లోకేశ్

Nara Lokesh responds to Chittoor womans emotional plea from Oman
  • ఒమన్‌లో చిక్కుకున్న చిత్తూరు జిల్లా మహిళ గ్రంధి ఇందిర
  • ఆమెను ఆదుకోవాలంటూ సోషల్ మీడియాలో నెటిజన్ విజ్ఞప్తి
  • కన్నీటి పర్యంతమవుతున్న మహిళ వీడియోను షేర్ చేసిన నెటిజన్
  • విజ్ఞప్తిపై తక్షణమే స్పందించిన మంత్రి నారా లోకేశ్
  • ఇందిరను సురక్షితంగా రప్పిస్తామని హామీ, రంగంలోకి మంత్రి కార్యాలయం
ఒమన్‌లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్న చిత్తూరు జిల్లా మహిళను ఆదుకునేందుకు ఏపీ మంత్రి నారా లోకేశ్ ముందుకు వచ్చారు. బాధితురాలిని సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు తక్షణ చర్యలు తీసుకుంటున్నామని ఆయన హామీ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా వచ్చిన ఒక విజ్ఞప్తిపై మంత్రి వెంటనే స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా, రాళ్లూరు గ్రామానికి చెందిన గ్రంధి ఇందిర ఉపాధి కోసం ఒమన్ వెళ్లారు. అక్కడ ఆమె శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తనను స్వదేశానికి తీసుకురావాలని వేడుకుంటున్న వీడియోను ఒక నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "నారా లోకేశ్ అన్నా, దయచేసి ఈమెను తిరిగి స్వదేశానికి రప్పించడంలో సహాయం చేయండి" అంటూ ఆ వీడియోతో పాటు మంత్రికి విజ్ఞప్తి చేశారు.

ఈ పోస్ట్‌పై మంత్రి నారా లోకేశ్ తక్షణమే స్పందించారు. "ఒమన్‌లో శ్రీమతి గ్రంధి ఇందిర ఎదుర్కొంటున్న బాధాకరమైన పరిస్థితిని మా దృష్టికి తెచ్చినందుకు ధన్యవాదాలు. ఆమె క్షేమంగా ఉండటమే మా ప్రధమ ప్రాధాన్యత. ఈ విషయంపై నా కార్యాలయం తక్షణమే స్పందించి, ఆమెను సురక్షితంగా భారతదేశానికి తిరిగి తీసుకురావడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది" అని లోకేశ్ భరోసా ఇచ్చారు. మంత్రి కార్యాలయం ఇప్పటికే ఈ విషయంపై దృష్టి సారించిందని, ఇందిరను క్షేమంగా తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించిందని ఆయన స్పష్టం చేశారు. మంత్రి నుంచి తక్షణ స్పందన రావడంతో ఆమె కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
Advertisement
Nara Lokesh
Grandhi Indira
Oman rescue
Chittoor woman
Andhra Pradesh government
NRI help

More Telugu News