స్టేజ్‌పై విద్యార్థి కాలర్‌ పట్టుకున్న ప్రొఫెసర్‌.. వైరల్‌ వీడియోతో రచ్చ!

స్టేజ్‌పై విద్యార్థి కాలర్‌ పట్టుకున్న ప్రొఫెసర్‌.. వైరల్‌ వీడియోతో రచ్చ!

Himanshu K Patel Nirma University professor grabs student collar in viral video
  • నిర్మా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌-విద్యార్థి ఘటన వైరల్‌
  • కామెడీ షోలో విద్యార్థి వ్యాఖ్యతో వివాదం
  • స్టేజ్‌పై విద్యార్థి కాలర్‌ పట్టుకున్న ప్రొఫెసర్‌
  • ఘటనపై ప్రొఫెసర్‌ పటేల్‌ క్షమాపణ
  • విద్యార్థి కూడా క్షమాపణ చెప్పాడని పటేల్‌ వెల్లడి
గుజరాత్‌లోని నిర్మా యూనివర్సిటీలో జరిగిన ఓ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఓ కామెడీ కార్యక్రమంలో విద్యార్థిని వేదికపైకి పిలిచిన ప్రొఫెసర్‌.. అతడి కాలర్‌ పట్టుకున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నిర్మా యూనివర్సిటీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో సెప్టెంబర్‌ 18 నుంచి 20 వరకు టెక్నోఫోరా 2026 కార్యక్రమం జరిగింది. 800 మందికిపైగా పాల్గొన్న ఈ వేడుకలో టెక్‌ పోటీలు, వర్క్‌షాప్‌లు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో స్టాండప్‌ కామెడీ షో జరుగుతున్న సమయంలో ఓ విద్యార్థి ‘జల్దీ బోల్.. కల్‌ సుబహ్‌ పన్వేల్‌ నికల్నా హై’ అంటూ సరదాగా వ్యాఖ్య చేసినట్లు సమాచారం. దీంతో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌ విభాగం హెచ్‌ఓడీ డాక్టర్‌ హిమాన్షు కే. పటేల్‌ ఆ విద్యార్థిని స్టేజ్‌పైకి పిలిచారు. అనంతరం అతడి కాలర్‌ పట్టుకుని హెచ్చరించినట్లు వీడియోలో కనిపిస్తోంది.

వైరల్‌ అవుతున్న వీడియోలో పూర్తి ఘటన కనిపించలేదని పటేల్‌ తెలిపారు. విద్యార్థి తనతో అలా మాట్లాడటంపై ఆగ్రహం వచ్చిందన్నారు. తల్లిదండ్రులతో కూడా ఇలాగే మాట్లాడతావా? అని ప్రశ్నించానని చెప్పారు. విద్యార్థి తన తప్పును అర్థం చేసుకొని క్షమాపణ చెప్పాడన్నారు. తర్వాత విద్యార్థులు తన కాళ్లకు నమస్కరించారని, తాను కూడా తన ప్రవర్తనకు క్షమాపణ చెప్పానని వివరించారు. విషయం అక్కడితో ముగిసిందని తెలిపారు.

వీడియోపై కొందరు ప్రొఫెసర్‌ తీరును తప్పుబడుతున్నారు. మరికొందరు విద్యార్థి చేసిన వ్యాఖ్య సరికాదని అంటున్నారు. ఈ వ్యవహారంపై గుజరాత్‌ ఎన్‌ఎస్‌యూఐ నేతలు కూడా స్పందించినట్లు వార్తలు వచ్చాయి. అయితే నిర్మా యూనివర్సిటీ మాత్రం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

యూనివర్సిటీ వివరాల ప్రకారం పటేల్‌ సీనియర్‌ ప్రొఫెసర్‌గా, విభాగాధిపతిగా పనిచేస్తున్నారు. ఆయనకు మూడు దశాబ్దాలకు పైగా బోధన, పరిశోధన రంగాల్లో అనుభవం ఉంది. ఘటనపై ఆయన వివరణ ఇచ్చినా.. పూర్తి వీడియో బయటకు రాకపోవడంతో సోషల్‌ మీడియాలో చర్చ కొనసాగుతోంది.
Advertisement
Himanshu K Patel
Nirma University
Professor grabs student collar
Technofora 2026
Viral video Gujarat
Student professor controversy

More Telugu News