పనీర్‌ పేరుతో మోసం ఇక కుదరదు.. దేశవ్యాప్తంగా నిషేధానికి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రతిపాదన

పనీర్‌ పేరుతో మోసం ఇక కుదరదు.. దేశవ్యాప్తంగా నిషేధానికి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రతిపాదన

FSSAI proposes nationwide ban on fake paneer to stop consumer fraud
  • అనలాగ్‌ పనీర్‌పై దేశవ్యాప్తంగా నిషేధానికి ప్రతిపాదన
  • ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ముసాయిదా నిబంధనలు విడుదల
  • పనీర్‌ పేరుతో వినియోగదారులను తప్పుదోవ పట్టించకుండా చర్య
  • ‘అనలాగ్‌’ ఉత్పత్తులకు పనీర్‌ పేరు తొలగింపు
  • ముసాయిదాపై 60 రోజుల పాటు అభిప్రాయాల స్వీకరణ
పనీర్‌ పేరుతో విక్రయిస్తున్న నాన్‌-డెయిరీ ఉత్పత్తులపై కేంద్రం కీలక చర్యలకు సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా అనలాగ్‌ పనీర్‌ తయారీ, విక్రయాలను నిషేధించేలా ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ప్రతిపాదించింది. ఇందుకు సంబంధించిన ముసాయిదా నిబంధనలను ప్రజల అభిప్రాయాల కోసం విడుదల చేసింది.

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ముసాయిదా ప్రకారం.. పనీర్‌ స్వభావం, అందులో ఉపయోగించిన పదార్థాల విషయంలో వినియోగదారులు తప్పుదోవ పట్టకుండా ఈ మార్పులు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ‘అనలాగ్‌ ఇన్‌ డెయిరీ కాంటెక్ట్స్‌’ కేటగిరీలో లైసెన్స్‌ లేదా రిజిస్ట్రేషన్‌ పొందిన ఉత్పత్తులు ఇకపై తమ పేరు, లేబుల్‌, మార్కెటింగ్‌లో ‘పనీర్‌’ అనే పదాన్ని ఉపయోగించకూడదు.

ఈ నిబంధనలను ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ (ప్రొహిబిషన్‌ అండ్‌ రెస్ట్రిక్షన్స్‌ ఆన్‌ సేల్స్‌) రెగ్యులేషన్స్‌లో చేర్చాలని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిర్ణయించింది. ముసాయిదాపై అభిప్రాయాలను 60 రోజుల వ్యవధిలో స్వీకరించనున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు అనలాగ్‌ పనీర్‌ తయారీ, విక్రయాలపై నిషేధం విధించాయి.

మహారాష్ట్రలో ఇటీవల ఆర్టిఫిషియల్‌ అనలాగ్‌ పనీర్‌ తయారీ, పంపిణీ, విక్రయాలపై ఏడాది పాటు నిషేధం విధించారు. రాష్ట్రంలో ఇటీవల పరీక్షించిన పనీర్‌ నమూనాల్లో 35 శాతానికి పైగా నాణ్యత పరీక్షల్లో విఫలమయ్యాయి. కూరగాయల కొవ్వు కల్తీ ఉన్నట్లు పరీక్షల్లో తేలడంతో ఈ చర్య తీసుకున్నారు. గుజరాత్‌ ప్రభుత్వం కూడా నాన్‌-స్టాండర్డ్‌ అనలాగ్‌ పనీర్‌, చీజ్‌, వెన్న తయారీ, నిల్వ, రవాణా, పంపిణీ, విక్రయాలపై రాష్ట్రవ్యాప్తంగా నిషేధం ప్రకటించింది.

కూరగాయల నూనెతో పాటు ఇతర డెయిరీయేతర పదార్థాలతో తయారు చేసిన ఉత్పత్తులను పనీర్‌గా విక్రయించడం వల్ల వినియోగదారులు మోసపోయే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీనివల్ల అసలైన పాల ఉత్పత్తుల తయారీదారులకు నష్టం కలగడంతో పాటు ఆహార భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి.
Advertisement
FSSAI
Analog Paneer Ban
Fake Paneer Fraud
Food Safety Regulations
Dairy Product Standards
Vegetable Fat Adulteration

More Telugu News